Sunday, 28 April 2013

ప్రేమకు మారుపేరు


       రచన : వెంకట్ హేమాద్రిబొట్ల

                                       
అమ్మ అనే పదానికి నిర్వచనం ఏమిటి? – మీరు ప్రశ్న వేశారు.  దానికి నేను, నాకు తోచిన రీతిలో ఏదో ఒక  సమాధానం చెప్తాను. ఇది ఒక భాషాయుక్తమైన ప్రక్రియ.   కొన్ని పదాలను ఉపయోగించి, వాటిని వాక్యాలుగా కూర్చి సమాధానం చెప్పడం ఈ ప్రక్రియలో భాగం.  కానీ ఆ పదాలు, వాక్యాలు కలిపి చెప్పినది సరిపోతుందా?  అమ్మ గురించి చెప్పాలనుకున్న భావాలు ఈ మాటల సాయంతో ఎవరైనా చెప్పగలరా?  లేరు, చెప్పలేరు.  అది ఏ భాష అయినా కానివ్వండి, సమాధానం చెప్పాలనుకున్నప్పుడు, ఆ భాష సరిపోదు అనిపిస్తుంది.  అందుకు కారణం కొన్ని భావాలను మాటల రూపం లో చెప్పలేక పోవడమే.
పరిమితి  కలిగిన భాష, అపరిమితమైన ప్రేమను వ్యక్తం చేయలేదు కదా!
అయితే, ఎంత చెప్పినా తక్కువే అని తెలిసినా, కవులు రచయితలూ, వారికి సాధ్యమయినంతగా అమ్మ గురించి చెప్తూనే వున్నారు.   దేవుడు సృష్టించిన “మాతృమూర్తి” అనే అధ్బుతమైన వ్యక్తి గురించి ఎంతో కొంత చెప్పాలి అన్న తపనే వారిచేత అలా చేయించింది.
అలాగే, చలన చిత్రాల మాధ్యమంతో కూడా ఈ ప్రయత్నం చేసారు.   ఆ ప్రయత్నం లో భాగంగా వచ్చిన కొన్ని చలన చిత్రాలు ఈ పాత్రను ఎలా మలిచారో చూద్దాం.
ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది “అమ్మ రాజీనామా” చిత్రం గురించి.   కాకపోతే, ఈ కథని ఒక సినిమాకథలా కాక, ఆ మధ్య వచ్చిన “మహాభారత్” టి. వి. సీరియల్ లో ముందుగా వచ్చే “మై సమయ్ హు” లాగా మొదలుపెడదాము.  ఎంత సేపూ టైం సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు అని ప్రతీదానికీ అంటూ ఉంటాం కదా?  ఏవో చేసిన కొద్ది పనులకే “హుష్హు” అంటూ తెగ బిల్డ్ అప్ ఇస్తూ ఉంటాం.  మరి “అమ్మ” అలా ఎప్పుడైనా అనుకుందా?  అనుకుంటే ఒక్క రోజైనా గడుస్తుందా?  ఈ ప్రశ్నలకి జవాబులు వెతికేందుకు ఈ “సమయ్” కథ ఏమిటో చూద్దాం.
ప్రతీ రోజూలాగే ఆ రోజు కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకి ఉదయం అయ్యింది.  సమయం – అవుతున్న ఒక్కో పనిని చూస్తూ ముందుకి వెళుతోంది.  ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న అనుభవం కారణంగా పనులు ఒకటి తరువాత ఒకటి అవుతున్నాయి.  కానీ, ఎక్కడా పెద్ద చప్పుళ్ళు అవీ లేవు.  వీలైనంత నిశ్సబ్దంగా ఆ పనులు చక్క పెట్టబడుతున్నాయి.  నాలుగు నుంచి ఆరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది -  రోజు తరువాత రోజు, సంవత్సరం పై సంవత్సరం.
అవును, అమ్మ దిన చర్య రోజూ ప్రొద్దునే ఇలా ప్రారంభం అవుతుంది.   మిగితావారు లేచేలోపు సగం పనులు అయిపోయేలా, అవ్వాల్సిన మిగతా పనులకి తయారు అయ్యేలా.
సమయానికి ఈ క్రమం అంతా రోజూ చూసి, చూసి అలవాటు అయిపొయింది.  అయితే, ఈ రెండు గంటలు దానికి ఎంతో ఇష్టమైన కాలం.  ఎందుకంటే, ఆరు గంటల నుంచి దానికి వేరే విధమైన పరిస్థితులు ఎదురువుతాయి.  గందరగోళం మొదలవుతుంది.  అందరూ అటు ఇటు పరుగు పెడుతూ వుంటారు.  ఒక్కరు కూడా సమయంతో  సమన్వయం తోటి పనులు చేసుకోరు సరికదా,  పై పెచ్చు ఆ సమయాన్నే అంటూ ఉంటారు -  “ఎలా పరుగెడుతోందో చూడండి”? అంటూ.  “నేను ఓ రెండు గంటల ముందు, ఇప్పుడు ఒకేలా ఉన్నాను కదా”?, నన్నెందుకు అంటున్నారో అర్ధం కాదు అనుకుంటూ ముందుకు కదులుతూ ఉంటుంది అది.  ఒక్కొక్కరికి తెల్లవారుతూ ఉంటుంది … ఆరు గంటలకి కొంతమందికి, ఏడింటికి కొందరికి – ఎనిమిది, తొమ్మిది – ఇలా వారుతూనే ఉంటుంది.
ఒక్కొక్కరూ లేచి, వారి పనులు వారు చేసుకుని, అందుకు తెగ హడావుడి పడిపోయి, చివరికి ఎలా అయితేనేం తయారు అవుతారు.  ఇస్త్రీ బట్టలు రెడీగా ఉన్నాయా?  ఉన్నాయి.  యూనిఫారం రెడీగా ఉందా?  ఉంది? షూస్? రెడీ.  చొక్కా బటన్ లేదు – స్నానం చేసే లోపు కుట్టి ఉంటుంది.  టిఫిన్ రెడీ.  బస్ కి చిల్లర రెడీ.  బైక్ లో పెట్రోల్ కి డబ్బులు రెడీ.  అమ్మా కీస్ ఎక్కడ?  నిన్న టి.వి. చూస్తూ పక్కనే టేబుల్ మీద పెట్టావు.  లంచ్ బాక్స్ – అది కూడా సర్ది టేబుల్ మీదకి వచ్చింది, ఎప్పుడో మరి?  కాఫీ, టీ, పాలు, రెండో సారి కాఫీ? – రెడీ.  నేను కార్న్ ఫ్లేక్స్ తింటాను – ఓ. కే.  నాకు ఓట్స్ కావాలి -  అలాగే.  అబ్బా! ఇవాళ కూడా ఉప్మా యేనా?  దోసెలు కూడా ఉన్నాయి.  మిగిలిన హోం వర్క్?  అయిపొయింది.   పుస్తకానికి అట్ట?  వేసి ఉంది.   ఈ ప్రశ్నలకి సమాధానాలు వినగానే ఒక్క క్షణం “హమ్మయ్య” అనుకున్న వారు – అవి ఎలా అయ్యయో?  అమ్మకి ఇవన్నీ చేయడానికి వీలు ఎప్పుడు చిక్కిందో? అని ఆలోచించే టైం మాత్రం లేదు.  అలా మొదలైన రోజు, ఒక పని తరువాత ఒకటి గా రోజంతా సాగుతూనే ఉంటుంది.  రాత్రి వరకూ.
ప్రతీ రోజూ లాగే ఆ రోజు కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకి ఉదయం అయ్యింది.  సమయం కూడా బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది – అమ్మ లేపుతుంది కదా అన్న ధీమాతో.  కానీ ఆ రోజు అలికిడి ఏదీ లేదు.  ఎందుకో అనుమానం వచ్చి చూసిన ఆ సమయ్ కి అమ్మ కుర్చీ లో కూర్చుని కాఫీ తాగుతూ కనపడింది.  హమ్మయ్య అనుకుంటూ, ఏంటి అమ్మ ఇంకా అలా కూర్చున్నావు, “లే, అందరూ లేచే టైం అయ్యింది, మొదలుపెట్టు” అంటూ సమయం మొదటిసారిగా హడావిడి పడింది. అందుకు అమ్మ చిరునవ్వుతో అంది – లేదు, నేను ఇవాళ ఏమి చెయ్యట్లేదు.  ఆ తరువాత ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.  తన నేస్తమైన సమయానికే కాదు కదా, ఆ పై లేచిన ఆ ఇంట్లో సభ్యులెవ్వరికీ అర్ధం కాలేదు.  ఏమైందో తెలీదు, పనులు ఎలా చేసుకోవాలో తెలీదు.  అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో కూడా తెలీని అయోమయ పరిస్తితి.  అందుకు కారణం ఏమిటో కూడా తెలియని మానసిక స్థితి లో వాళ్ళు ఉన్నారు.  అమ్మ – ఇది అవ్వలేదు ఏమిటి?  అది రెడీ గా లేదు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు తప్ప వేరొక ఊహ వారికి రావట్లేదు.  అప్పుడు చెప్పింది అమ్మ – నేను ఈ పనులేవీ చెయ్యట్లేదు, నేను రాజీనామా చేస్తున్నాను.  వాట్?  అవును, మీరు విన్నది నిజమే – నేను ఈ నాలుగు టు పదకొండు/పన్నెండు, మూడు వందల అరవైఅయిదు రోజుల ఉద్యోగం నుంచి రాజీనామా చేస్తున్నాను.  మీకు ఎన్ని సార్లు చెప్పినా టైం కి లేవడం, తయారు అవ్వడం లేదు కదా, కనీసం చేసిన వాటికి సాంత్వన గా ఒక మాట మాట్లేడేందుకు కూడా వీలు అవ్వట్లేదు.  ఇంక నేను ఎందుకు చేయాలి?  అంటున్న అమ్మ మాటలకి వారు అవాక్కై చూస్తూ ఉండిపోయారు.  మెల్లిగా వారికి జ్ఞానోదయం అవుతుంది.  మేము ఇకపై అలా చేయము అమ్మ, నువ్వు చెప్పి నట్టు వింటాము అనడంతో ఆ తల్లి కరిగిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతుంది.  ఎంతైనా కరుణామూర్తి కదా.  పిల్లలు కూడా అప్పటినుంచి బుద్ధిగా, వారి పనులు సమయానికి చేసుకోవడమే కాకుండా, అమ్మకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు.  ఇదంతా చూస్తున్న మన నేస్తం అయిన సమయం చిరునవ్వు నవ్వుతుంది.  అదీ కథ.

మనం కథలాగా చెప్పుకోడానికి సమయం, అమ్మ నేస్తం, అని ఒక పాత్ర ని ప్రవేశ పెట్టాను.  అది తప్ప, పైన చెప్పిన కథ, సన్నివేశాలు అన్నీ “అమ్మ రాజీనామా” చిత్రం లో ఉన్నాయి.  దాసరి నారాయణ రావుగారి దర్సకత్వంలో ఊర్వశి శారద అధ్బుతంగా నటించిన చిత్రం ఇది.  అమ్మ, ఓర్పు, సహనం గురించి ఎంతో గొప్పగా ఇందులో వర్ణించారు.  “తను చేస్తుంది లే” అన్న అలసత్వం తో ఉన్నవారికి అమ్మ గనక ఒక్క రోజు అలా చెయ్యకపోతే ఎంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
అమ్మ గొప్పతనంలో ఇంకొక కోణం తెలియచేసే చిత్రం “పెళ్లి”.   ఇందులో “సుజాత”, “మహేశ్వరీ” తల్లీకూతుళ్ళు.  ఒక కాలనీలో పోర్షన్ అద్దెకి తీసుకుని ఉంటారు.  పక్క పోర్షన్ లో ఉంటున్న “వడ్డే నవీన్” మహేశ్వరిని ఇష్టపడతాడు.  ఈ లోపు “పృథ్వీ” కారెక్టర్ ఎంటర్ అవుతుంది.  సుజాత తనకి తల్లి అని, మహేశ్వరీ తనకి భార్య అనీ అంటాడు.  అందరూ ఇదేమిటి అనుకుంటుండగా అసలు సంగతి తెలుస్తుంది.  పృథ్వీ నిజంగా మహేశ్వరీ భర్తే అని, అయితే తను చేసే దుర్మార్గాలు, పెళ్ళాన్ని పెట్టే కష్టాలు చూడలేక ఆ తల్లి, కోడలని తీసుకుని వేరే చోటికి వచ్చిందని తెలుస్తుంది.  చివరకి కన్న కొడుకుని కాదని కోడలిని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతుంది. చివరికి ఈ పెళ్లికి అడ్డుపడాలనుకున్న కొడుకు విషమిచ్చి తానూ కూడా విషం తాగుతుంది. ఈ కథలో అమ్మ, కేవలం తన కొడుకు అయినంతచేత వాడు చేసే చెడుపనులకి మద్దతు ఇవ్వదు.  అలాగే కోడలు చేయని తప్పుకి శిక్ష అనుభవించ కూడదని, తన జీవితం చక్క దిద్దాలని అనుకుంటుంది.

“తల్లా పెళ్ళామా”? అసలు ఇలాంటి ప్రశ్నే రాకూడదు.  ఎవరికి సముచితమయిన స్థానం వారికుంది.  అది అలా ఉంచితే, NTR స్వీయ నిర్మాణం లో శాంతా కుమారి, చంద్రకళ తో పాటు నటించిన చిత్రం పేరు కూడా ఇదే.  సరిగ్గా టైటిల్ కి తగ్గ కధాంశం ఈ చిత్రం లో ఉంటుంది.  కుటుంబాలలో వచ్చే మనస్పర్ధలు, అటు తల్లీ, ఇటు పెళ్ళాం, వారిలో ఎవరి వైపు మొగ్గు చూపాలి అన్నది కథ.   వేరు వెళ్ళిపోదాం అన్న చంద్రకళ తో అలాగే అని, ఆ తరువాత వాళ్ళకి పుట్టిన బిడ్డని తీసుకుని వచ్చేస్తాడు NTR.   ఇదేంటి, ఇలా చేశారు? అని అడిగితే, ఆ రోజు నువ్వు చేసింది కూడా ఇదే కదా అంటాడు.  తన తప్పు తెలుసుకుంటుంది చంద్రకళ.  అందరూ కలవడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఇదే అంశం “బొట్టూ కాటుక” చిత్రంలో కూడా ఉంది.  శ్రీధర్ కి తల్లిగా నిర్మలమ్మ, భార్యగా జయంతి నటించారు.  వాళ్ళ పిల్లలు ఒకరోజు “మాక్ కోర్ట్” “ఉత్తుత్తి కోర్ట్” నిర్వహించి తల్లి గొప్పా, భార్య గొప్పా అని అడుగుతారు.  అందుకు తల్లే గొప్ప అని తీర్పు వస్తుంది.   అందుకు అలుగుతుంది జయంతి.  ఆ మరునాడు జయంతి పుట్టినరోజు అవుతుంది.  ఏమి ఎరుగనట్టు ఉన్నవారు అందరూ నిజానికి ఒక గది అంతా డేకోరేట్ చేసి సర్ప్రైజ్ పార్టీ ఇస్తారు.  ఒక్కసారి గా ఎంతో రిలీఫ్ ఫీల్ అయిన తనతో అంటాడు శ్రీధర్ – నిన్న చెప్పింది “అమ్మ” గొప్పది అని.  నాకు తను అమ్మ ఎలాగో నువ్వు పిల్లలకి అలాగే కదా.  అది అందులోని గొప్పతనం అని.  ఇలాంటి హృద్యమైన సన్నివేశాలు మనకి పాత చిత్రాలలో కనపడుతాయి.

అలాగే, హీరోయిన్ తో ఇటువంటి ప్రశ్నే వేయిస్తారు దర్శకుడు ఎస్. వి. కృష్ణా రెడ్డి గారు  “యమలీల” చిత్రంలో.  అందులో ఇంద్రజ – “నీకు నేను కావాలా?, నీ తల్లి కావాలో? తేల్చుకో”  అంటుంది ఆలీ తో.  అందుకు అతను – నన్ను కని, పెంచి, పెద్ద చేసిన తల్లే నాకు ముఖ్యం అని బదులిస్తాడు.  ఆ జవాబులో ఉన్న గొప్పతనం అర్ధం చేసుకున్న ఇంద్రజ కూడా తన తప్పు తెలుసుకుని మారుతుంది.
ఇక అవసరం అయితే, అన్యాయం ఎదిరించే తల్లులను, వారి బిడ్డలను అభినవ శివాజీలుగా తయారు చేసే జిజియాబాయిలను మనం “నిజం” (తల్లిగా తాళ్లూరి రామేశ్వరి, తనయుడిగా మహేష్ బాబు), “ఛత్రపతి” (తల్లి భానుప్రియ, కొడుకుగా ప్రభాస్) చిత్రాలలో చూస్తాం.  వారి పిల్లలకి ధైర్యం నూరి పోసి వారిని అన్యాయాన్ని ఎదిరించే యోధులుగా, నలుగురికి మంచిచేసే వారిగా తీర్చి దిద్దు తారు ఇందులో.
మగాళ్ళు అందరూ మోసం చేసేవాళ్ళే, అందుకే అసలు పెళ్ళే చేసుకోకూడదు అంటూ కూతురికి (ప్రియమణి)  చెప్పే తల్లి పాత్ర లో “రోజా” కనిపిస్తుంది “గోలీమార్” చిత్రం లో.  అందరూ అలా కాదు, “గోపీచంద్” లాంటి  మంచి వాళ్ళు కూడా ఉంటారు అని హీరో పాత్ర ద్వారా తెలిసిన తరువాత, ఆ దృక్పధం మార్చుకుని వారికి అండగా నిలుస్తుంది.
ఇటీవల కాలంలో తల్లీకొడుకుల బంధాన్ని ఒక అందమైన స్నేహంగా కూడా చిత్రీకరించారు.  “ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్”  మూడింటిలో చివరి రెండూ విషయాలలో, అంటే మంచి నడవడిక నేర్పి, మార్గదర్శి గా ఎప్పుడూ ఉండే అమ్మ, మంచి స్నేహితురాలిగా కూడా కనపడుతుంది ఈ చిత్రాలలో.
“అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి” చిత్రం లో “రవితేజ” కి ఎప్పుడూ అండగా ఉండడమే కాకుండా తనతో మంచి స్నేహితురాలిగా మెలిగి, సపోర్ట్ చేసే తల్లి గా “జయసుధ” కనిపిస్తారు.  ఈ చిత్రంలో వీరిపై “నీవే నీవే నేనంట, నీవే లేక నీనే లేనంట” అన్న ఒక హృద్యమైన పాటను కూడా చిత్రీకరించారు దర్శకులు పూరి జగన్నాథ్.

అలాగే, ఈ మధ్య రిలీజ్ అయిన “అలా మొదలైంది” చిత్రం లో “నాని” కి ఫ్రెండ్ గా ఉంటూ, ప్రేమ విఫలం అయ్యి బాధలో ఉన్నపుడు ధైర్యం చెప్పి,  మళ్ళీ మామూలు మనిషిని చేసే స్నేహితురాలిగా “రోహిణి” పాత్రను చక్కగా మలిచారు దర్శకురాలు నందిని రెడ్డి.
మేరె పాస్ బంగ్లా హై, గాడి హై, పైసే హై, తుమ్హారే పాస్ క్యా హైన్? అంటాడు “అమితాబ్” “దీవార్” చిత్రంలో “శషి కపూర్” తో.  (నా దగ్గర పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది?).
అందుకు ఒకే ఒక సమాధానం సమాధానం – “మేరే పాస్ మా హైన్”.  నా దగ్గర తల్లి ఉంది.  తల్లి ఉంటే అన్ని ఉన్నట్లే, లేదంటే అన్నీ ఉన్నా నిరుపేదే అన్న నిజం ఒక్క ముక్కలో చెపుతారు ఇందులో.  అది ఎంతైనా నిజం కదా.
“అమ్మను మించి దైవమున్నదా?, ఆత్మను మించి అద్దమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే” అని “20 వ శతాబ్దం” చిత్రంలో ఒక అద్బుతమైన పాట రాసారు “సినారె”.  ఇది ఎంతైనా నిజం.
కొన్ని వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అమ్మ గురించి అయితే చాలా చాలా తక్కువ.  చివరగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు అమ్మ గురించి తరచూ చెప్పే ఒక మాట చెప్పి ముగిస్తాను.
ఒకడు వేశ్య ఇంటికి వెళ్ళి తలుపు తడుతాడు.  నీ తల్లి యొక్క గుండె తీసుకుని వస్తేనే తలుపు తీస్తాను అంటుంది ఆ వేశ్య అతనితో.  వాడు కామంతో కళ్ళు మూసుకు పోయిన వాడై పరుగు పరుగున వెళ్ళి ఆ తల్లిని గుండెకాయ అడుగుతాడు.  ఆవిడ అలాగే తీసి ఇస్తుంది.  అదే పరుగున వాడు అది చేత పట్టుకుని వెళ్ళబోతూ, గడపకి కాలు తగిలి కింద పడుతాడు.  అప్పుడు వాడి చేతిలో ఉన్న గుండె అంటుంది – “అయ్యో! దెబ్బ తగిలిందా నాయనా?, చూసుకుని వెళ్ళరా” అని.  అది తల్లి అంటే.
అటువంటి తల్లిపై, మన చలన చిత్రాలలో ఉన్న కొన్ని పాత్రల గురించి, సన్నివేశాల గురించి నాలుగు మాటలు చెప్పే అదృష్టం నాకు కలిగింది.  మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.

 

No comments:

Post a Comment