Sunday, 28 April 2013

వీర ప్రేమ

రచన : శ్రీధర్ అయల
ఇరవై సంవత్సరాల నిండు విగ్రహం ! పొడవుకి తగిన శరీర పుష్టి, పుష్టికి తగిన అవయవాల బిగి, బిగికి తగ్గ లాఘవం , లాఘవానికి తగిన కౌశలం ! కలిగి ఉన్నాడు ‘వీరం దొర’.
క్రూర మృగాలకి వీరందొర సింహస్వప్నం. భీకరమైన వాని శరీరాలయంలో మెత్తని ప్రేమ పూరిత హృదయం దాగుంది. వాని విశాల రక్తాంత నయన కోణాలలో కరుణ నిండి ఉంది.
అప్పుడు మిట్ట మధాహ్నం ! నభోమణి మధ్యంలో నిప్పులు చెరగుతున్నాడు. పశువుకి మృగాదులు చల్లని జాగాలో చేరుకొని విశ్రాంతిని అనుభవిస్తున్నాయి. పక్షిగణం ఆకు -జొంపాలలో కువకువలాడు తున్నాయి.
నల్లసాని రాయివలె నిగనిగలాడుతున్న దొర విశాల వక్ష స్థలం చెమట బిందువులచే అలంకరింపబడి వీరలక్ష్మి యొక్క పాద పీఠంలాగ ఉంది. జీడి నూనె పట్టించి , కొమ్ము పన్నెతో దువ్వబడిన కేశాలు ఎత్తి శిరోపరి భాగంలో ముడివేయబడి , రంగు రంగు పక్షి ఈకల్తో మెరసిపోతోంది !కటి ప్రదేశానికి బిగించి కట్టిన ముతక ధోవతి సిలకట్టు , మొలలో దోపుకొన్న ఒరతో కూడిన బాకు, ప్రక్కన వ్రేలాడుతున్న పదునైన గొడ్డలి, చేతిలో నల్ల త్రాచువలె భయంకరమైన విల్లు, వీపుపై నల్లని దట్టీతో బిగించి కట్టబడిన అమ్ముల పొది కలిగి ‘ వీరందొర’ ,భిల్ల వేషంలో అర్జునునికి ప్రత్యక్షమైన సాంబశివుని వలె ఉన్నాడు !
ఒక పెద్ద చెరువులో తామరలు, కలువలు నిండి ఉన్నాయి. చెరువు ఒడ్డున శాఖోపశాఖలతో మర్రిచెట్టు సగం చెరువుని తన ఛాయలో ఇముడ్చుకొని గంభీరంగా ఉంది ! చెట్టు మొదట ఒక బండ రాయి అరుగు వలె ఉంది.దానిపై ఆశీనుడయ్యాడు వీరందొర.
వీరందొర వెదురు కోలల్ని తయారు చేస్తున్నాడు. వాని చేతులు పనిచేస్తున్నాయి, కాని వాని హృదయం ఈ పనిలో ఇమడకుండా ప్రత్యేకమైన పని చేసుకొంటోంది.
అది ( మనస్సు) ఒక మనోహర రూపాన్ని చిత్రీకరణ చేసుకొంటోంది ! ఆ మధుర చిత్రీకరణలో హృదయ దర్పణ గతమైన రూపం యొక్క ఒక్కొక్క అంగం ప్రతిఫలించింది.శరీరం పండిన నిమ్మపండు, దాంట్లో ప్రవహించే తరంగ మాలినీ ఝురి అభ్రగంగా సదృశం ! ముఖం చంద్ర సదృశమై మృదు మధుర కమనీయం !
కన్నులు తామర దళాల వలె మనోహర తేజోపూరిత రమణీయం ! నాసిక కండ్ల ఔన్నతిని చాటుటకై ఉన్నతమై గంభీరాకృతి దాల్చి దర్శనీయం ! పెదిమలు మాణిక్య కాంతి సముజ్వలమై మకరంద రస ప్రపూరితం !
వీరందొర మత్తెక్కిన చూపులు హృదయకుహరంలో చిత్రీకృతమైన ఇట్టి రూపాస్వాదనలో లోనమై పోయాయి
“మావా ! మావా ! ” అని వెనకనుంచి ఒక కిన్నెర కంఠం వినిపించింది.
“బిగువుగా ఉండాల — చూస్తాం కదా , సిక సంగతి !” అని తనలో తలంచి నవ్వుకొన్నాడు వీరందొర.
ఒక పడుచు వీరందొర వెనుక భాగానికి సమీపంలో వచ్చి నిలిచింది. ఆమెయే వాని హృదయ ఫలకంలో చిత్రితమ అందాల బాల !
“ మావ మా చెడ్డ కోపంగా ఉండాడు — నాకేం పోతాదంట ?” అని లోపల శబ్దించుకొంది రత్తి.
రత్తి మెల్లగా దొరని సమీపించింది.  వాని దగ్గరగా బండరాతికి చేరవేయబడిన విల్లి అందుకొంది ! నెమ్మదిగా అంబుల పొదిలోని వెదురు కోలని లాగింది ! విల్లుి వంచి  నారి ఎక్కుపెట్టింది, బాణాన్ని వింట తొడిగింది !
దొర ఓర కంటితో గమనించి, మందహాసం చేసాడు.
“ మావా ! ఓ కాసుకో ! కోల దూసుకు వస్తాది !” అంది రత్తి.
“ కాసుకొనే ఉన్నానే సిలకా ! ఆ కోలకే !” అన్నాడు దొర.
రత్తి కిలకిలా నవ్వింది. దొర హృదయ వీణాతంత్రులు స్పందించాయి.
“ మావా ! ఓ వెర్రి మావా ! రత్తి కోల ఏం సులకనా ?”
“ కాదే సిలకా ! దాని వేగం నాకంటే ఏరికే తెలుసు ?”
రత్తి విల్లుని మర్రిఊడకి తగిలించి , కోలని పొదిలో దోపి, దొరకి ఎడం ప్రక్కన మూతి ముడుచుకొని కూర్చొంది.
“ ఏం రత్తీ ! కోపమా ?”
“కాక మరేంది, అస్తమానం సిలకా, సిలకా అంటావు–”
“ పోనీయే ‘రత్తీ’ అని పిలుస్తాలే !” అని అంటూ దొర రత్తికి దగ్గరగా వచ్చాడు.
“ అదుగో మావా ! దగ్గరగా రాబోకు —”
“ ఏవంటా ?” అని బిగుసుకొని కూర్చొన్నాడు దొర.
“ అదో అప్పుడే కోపం ! నాను కన్నెపిల్ల కాదా మావా ?”
“ రత్తీ ! మనం పెండాడేద్దాం !”
రత్తి కిలకిలా నవ్వింది. ఆ నవ్వుల ధాళధళ్యం దొర హృదయంలో వెలుగు పుట్టించింది !
“ అయ్యో ! వెర్రి మావా ! మన పెండ్లి అయిపోయింది కాదా ?”
“ ఎప్పుడే రత్తీ ?”
“దుర్గ గుల్లో నాను పైట వేసిన రోజు, నాను నీ మెడలో మాలవేసా ! నీవుండావే నా మెల్లో మాల వేసి —” అని సిగ్గుతో కుంచించుకొని పోయింది ఆమె.
“ మరి ఇంకేం ?” అని రత్తి చెయ్యిని పట్టుకొని లాగాడు దొర.
రత్తి యీండ్రపడుతూ “మావా ! నీవు గండడివి కదూ ?” ప్రశ్నించింది
“ అవునే నూరు పాళ్లూనూ.” అన్నాడు తన నూగు మీసాలని దువ్వి.
“ గండడివైతే నా కోర్కె తీర్చి — తరువాత — నీ ఇష్టం !” అని తల దించుకొంది.
“రాణి కోరుతాది, రాజు తీర్చాలి ! ప్రాణం ఇచ్చి తీరుస్తా రత్తీ” అన్నాడు గుండె చరచుకొని దొర.
“రత్తి దొర చెవిలో గుస గుసలాడింది. –“ మాఁవా ! అదే నాను కోరేది, నాలు చణాలు చాలు
“ మాఁవా ! సరా,  మాఁవా !” అని తన కోర్కెని వ్యాఖ్యానం చేసింది.
“అమ్మ దొంగా ! ఎంతేసి కోరిక కోరావ్ !తల పోయే పనే!నా రత్తి ప్రాణం ఇస్తానే ” అని దొర రత్తిని చంటి పిల్ల వలె తన గజ సుండాలోపమ బాహువుల్తో ఎత్తాడు!
రత్తిని వీరం దొర తన గుండెకు అదుముకొన్నాడు. నున్నటి చెక్కిళ్ల మీద  తన ప్రతి బింబాన్ని చూసుకొని మురిసి పోయాడు! ఆమె  తన వెలుగుని చిలకరించాడు! ఉక్కువంటి తన శరీరంలో ఆ పుష్ప సుకుమార శరీరాన్ని నిర్భయంగా అదుముకొన్నాడు. రత్తి కొప్పు విడిపోయి క్రిందికి కాల సర్పంలాగ జీరాడింది. ఆమె కంఠం లోంచి తియ్యని నాదం, పొంగిన ఏటిలో బుడగల్లాగ ఉబికి, శబ్దించింది. ఆ నాదంలో వీరందొర శరీరంలో మధురానుభూతి చెలరేగింది.
“ మాఁవా ! చాలు  మాఁవా ! క్రిందకి దించేయి  మాఁవా !” అని రత్తి దొర కంఠానికి తన బాహు వల్లరని తగిలించి బుజ్జగించింది ప్రశాంతంగా
ఇంతలో టక టకమని రత్తిని మెల్లగా క్రిందకి దించి, వీరందొర చప్పుడు వచ్చిన వైపు పరికించి  చూసాడు !
బాణాల వలె దూసుకొంటూ అశ్వ దళం వస్తూంది
**********************
పై సంభవం జరిగి పదిహేను రోజులు దొర్లిపోయాయి.
అప్పుడు సంజె చీకట్లు దట్టంగా నాలుగు మూలలా అలముకొన్నాయి. సూర్యుడు అస్తాద్రి మరుగున చొచ్చిపోయాడు! అమావాశ్య మొదటి ముందటి రోజు కాబట్టి చుక్కల రేడు పొడవలేదు. చుక్కలు మాత్రం నిర్మలాకాశంలో వజ్రపు తునకల వలె మెరుస్తున్నాయి !
చల్లని గాలి వేప పువ్వుల పరిమళాన్ని తెచ్చి నలుమూలలా నింపుతూంది. దుర్గ గుడి వేప చెట్ల మధ్య ప్రశాంతంగా ఉంది.
ఒక జంట వేప చెట్టు క్రింద కూర్చొని మాట్లాడుకొంటోంది !
“ మాఁవా !నా కెంతో భయమేసింది, ఆ రోజు —” అంది రత్తి.
“ప్రక్కన రాజు నెట్టుకొని భయమేందే పిలా !” అన్నాడు వీరందొర.
“వూరి లోని వారంతా మన గుడిసెల వైపు పరిగెత్తుకొని వచ్చేరేందీ?”
“ఆడ పిల్లవు నీకేం తెల్సు ? యుద్దమే రత్తీ, యుద్ధం –”
“వూళ్లో వాళ్లు కొట్టుక ఛస్తుండరా, మాఁవా ”
“ఇజయనొగరం మారాజుకి, గజపతి మారాజుకి బెడిసిందట– ఇజయనగరం వోళ్లు,– అది కోట కాదే,
రత్తీ ! ఉక్కు ! ఉక్కు !! లోపలికి వెళ్లనొసమా ? ఈళ్లకి నోళ్ల సత్తువే గాని, జబ్బ సత్తువ లేదే పిల్లా !”
“అయితే  మాఁవా ! నీవేంది ఊరకొంటావ్ ? జబ్బ సత్తువ చూపరాదా ?”
“నా కోరిక ఇజయనగరం మారాజు తీరుస్తే, నా సత్తువ చూపిస్తా, చిటెకెలో కోట తలుపులు తీసెయ్యనా !”
“ నీ కోరికేంటో?”
“నా కంటూ ఏ కోరికా లేదే పిల్లా ! నీ కోరికే నాను కోరేది !”
వీరందొర రత్తి కౌగిట్లో కరిగిపోయాడు !
అప్పుడు ఇద్దరు మనుష్యులు వారి కెదురుగా వచ్చి నిల్చొన్నారు . సింహం వలె లేచాడు వీరందొర !
లేచాడో లేదో వాని చేతిలోని బాకు తళుక్కుమని మెరిసింది. రత్తి బుస్సు పెడుతూ కోడెనాగు వలె లేచింది. ఆమె చేతిలోనూ బాకు మెరిసిపోయింది !
“ యువ దంపతులారా ! మీ బాకులు మొలలో దోపండి. మేము మీకు విరోధులం కాదు. మీ స్నేహితులం–” అన్నాడొకడు.
దొర తన బాకుని మొలలో దోపుకొన్నాడు. రత్తి వాని చాటున నిలబడింది.
“వీరందొరా ! మాకు కొండవీడు దుర్గాన్ని వశం చేయగలవా ? నీవు కోరిన కోర్కె ఏదైనా సరే చక్రవర్తి గారు తీర్చగలరు–”
“ పెరుభూ ! రేపు అమావాశ్య ! రాత్రి– కోడితొలి కూత కూసేలోగా — నాను కోట తలుపుల్ని తెరుస్తా ! దుర్గమ్మ తోడు ! కాని నేను కోరింది–”
“ తప్పకుండా తీరుస్తాం , వీరం దొరా ! నీ కోరిక ఏదో చెప్పుఅది డబ్బుగా ఉంటే ఇప్పుడే ఇస్తాం. ఎంతైనా సరే —”
వీరందొర గుండెల కడ్డంగా చేతులు పెట్టుకొని గంభీరంగా నిలబడి—
“ పెరుభూ ! డబ్బుకు విలువేంది ? నా ఎత్తు డబ్బు పోసినా నాకొద్దు మారాజా !– ఇదిగో రత్తి  ! ఇఅది నా గుండెకాయ ! ఇది కోరింది తీర్చాల—”
“ అదేదో చెప్పవోయ్ !”
వీరందొర కొన్ని అడుగులు వెళ్లి తన ప్రేయసి కోర్కెని సన్నని స్వరంతో చెప్పాడు !
అతడు మేఘ గంభీర నినాదం వలె బిగ్గరగా నవ్వి –
“ వీరందొరా ! ఇదేనా నీ ప్రియురాలి కోరిక ! చక్రవర్తి తరఫున నెను వాగ్దానం చేస్తున్నాను విను. తప్పకుండా నీ ప్రియురాలి కోరిక తీర్చబడుతుంది. ” అని వీరందొర  చేతిలో చెయ్యి వేసి చెప్పాడు.
ఆ చేతికున్న ఉంగరాల పొళ్ల కాంతి జిగేలుమని మెరిసింది.
************************
అమావాశ్య రోజు—
మహారాజాధిరాజ, రాజ పరమేశ్వర, మూరు రాయర గండ, శ్రీ శ్రీ శ్రీ దేవ రాయల సేనా వాహిని కొండవీడు దుర్గాన్ని అర్థ చంద్రాకారంగా చుట్టు ముట్టింది !
ఆ రోజు ప్రాతఃకాలానికి కోటని పడగొట్టే ప్రయత్నాన్ని విరమింప జేసాడు శ్రీకృష్ణ దేవ రాయ చక్రవర్తి !
దాని కారణాన్ని ఊహించలేక తబ్బిబ్బులవుతున్నారు దండనాధులు ! ఎవరికిని చక్రవర్తిని కారణం అడిగే సాహసం లేదు !
గుడారాల్లో గానాలు, భరత నాట్యాలు, గాన సభలు జరుగుతున్నాయి ! సైనికులు మహోత్సాహంతో ఈ వేడకల్లో పాల్గొన్నారు.
రాత్రి మొదటి ఝాము గడచింది. దళపతులు తమ తమ సైనికుల్ని ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నారు !
“ఆంధ్ర వీరులారా ! ఈ రోజు తెల్లవారేలోగా మన సైన్యం దుర్గ ప్రవేశం చేసి తీరాలని చక్రవర్తి ఆజ్ఞ ! వారే స్వయంగా గజ యూధాన్ని నడిపిస్తారట ! దుర్గ ప్రవేశం ముందుగా చేసిన వారందరికీ విశేషంగా బహుమతులు ఇవ్వ బడుతాయి ! మీరు ఆంధ్రుల కీర్తి పతాకలతో పాటు , విజయనగర వీర వరాహ పతాకని ఎగురవేసే రోజు ఇది ! సూర్యోదయంతో పాటు మన వీర వరాహావతారం కొండవీడు దుర్గంపై ఉదయించాలి !
ముట్టడి ప్రారంబమయింది !
చక్రవర్తి అధినేతృత్వంపై గజయూధం నల్లని మేఘ మాలికల వలె పయనించింది ! విజయనగర విలుకాండ్రు వానజల్లు వలె వర్షం బురుజులపై కురిపిస్తున్నారు.
ఏనుగులు ముందుకి సాగుతున్నాయి ! వాటి పైనే ఉన్న విలుకాండ్రు విల్లు వంచి బాణాల్ని మెలకువతో వదులుతున్నారు.
సైనికులు బ్రహ్మాందమైన దూలాన్ని కోట తలుపులకి తాటించి బాదుతున్నారు. వీరి ప్రయత్నాన్ని సడలించడానికి కోటలోని వీర బృందం సల సల మరుగుతున్న చమురు పైనుండి వంపుతున్నారు. ముట్టడి భయంకర రూపం దాల్చింది !
********************
వీరందొర చీకటి పడగానే తనను తాను ముస్తాబు చేసుకొన్నాడు. ఒక చేత ఈటె, ఇంకొక చేత భయంకర కృపాణం ధరించాడు. తోలు దట్టీని కట్టుకొన్నాడు. పండ్రెండు బాకులు పేర్చిన పటకా బిగించాడు. చీమలు కరచినా బాధించకుండా ఉండేందుకు శరీరమంతా  కొన్ని మూలికా ద్రవ్యాలతో వండబడిన చమురు రాసుకొన్నాడు.త్తలకి నల్లని తలపాగా కట్టుకొన్నాడు. కొన్ని విష హరమైన మూలికల్ని తలపాగాలో పదిలం చెసుకొన్నాడు. రెండు బలమైన త్రాటి చుట్టాల్ని వీపుకి కట్టుకొన్నాడు.
ఇట్టి వేషంతో వీరందొర సింహ గమనంతో రత్తి ఉన్న గుడిసెకి దారి తీసాడు !
గడప ముందర రత్తి తల్లి దుర్గమ్మ కూర్చొని ఉంది !
“అక్కోయ్ ! రత్తి ఉండాదా?”
“ ఒలే రత్తీ ! మాఁవ వచ్చిండు —” అని కేక వేసింది దుర్గమ్మ.
“గుడిసెలోనికి దూరాడు వీరందొర.
“ మాఁవా ! ఇదేం వేషం ?” అడిగింది రత్తి.
“ ఇదేనే సిలకా ! యుద్ధ వేషం –” అన్నాదు వీరందొర.
రత్తి కండ్ల నీరు తిరిగింది ! గత రాత్రి విషయం ఆమెకి గుర్తుకి వచ్చింది. అపాయం శంకించింది ఆమె నిర్మల హృదయం–దుఃఖం పొంగి పొర్లింది. దొరని కట్టుకొని బావురుమని ఏడ్చింది రత్తి !
వీరందొర కండ్లు చెమ్మగిల్లాయి. ఆ ధీరుని విశాల వక్షం ఉబికింది ! రత్తి కన్నీటిని పెదిమలతో తుడిచాడు.
“గుడిసెలోనికి దూరాడు వీరందొర.
“ మాఁవా ! ఇదేం వేషం ?” అడిగింది రత్తి.
“ ఇదేనే సిలకా ! యుద్ధ వేషం –” అన్నాదు వీరందొర.
రత్తి కండ్ల నీరు తిరిగింది ! గత రాత్రి విషయం ఆమెకి గుర్తుకి వచ్చింది. అపాయం శంకించింది ఆమె నిర్మల హృదయం–దుఃఖం పొంగి పొర్లింది. దొరని కట్టుకొని బావురుమని ఏడ్చింది రత్తి !
వీరందొర కండ్లు చెమ్మగిల్లాయి ! అతని విశాల వక్షం ఉబికింది ! రత్తి కన్నీటిని అరను పెదవులతో తుడిచాడు వీరందొర! ఆమె కురుల్ని నిమురుతూ అన్నాడు ! “రత్తీ ఏడవకు, నా గుండె పగిలి పోతుండాది ! నన్ను చూసి నవ్వవే రత్తీ ! జనమ సాసువతం కాదే ! మనం చేసే పనులే సాసువతమే రత్తీ ! ఈ శరీరం ఒకనాడు కట్టేమీద కాలిపోతాది ! మన కర్మే నిలిచి ఉంటాది. నేను వీరుణ్ని, దొరబిడ్డని ! చావుకి బయం పొందమంటవా రత్తీ ? నన్ను తిలకం పెట్టి పంపవే ! దుర్గమ్మ తోడు — మారాజుకి మాట ఇచ్చా, ప్రాణం పోతే పోతాది కాని వీరందొర మాట పోదు” అన్నాడు వీరందొర.
“మాఁవా ! నేనూ దొర బిడ్డనే, మాఁవా ! నీ రత్తి నీవెక్కడ ఉంటే అక్కడే ఉంటది . ఇదుగో, నా ముద్దు మాఁవా !” అని రత్తి నూనె ఓడుతున్న మాఁవ శరీరాన్ని తనివి తీర కౌగలించుకొని వాని చెక్కిళ్లని మార్చి మార్చి ముద్దు పెట్టుకొంది !
ఆర్ద్ర నయనాలతో, దస ప్రపూరితమైన సింధూరాధరములతో, చక్కగా నవ్వింది ! మొల లోని బాకు తీసి తన కుడి చేతి బొటన వ్రేలిని సన్నగా చీరి , వీరందొర నుదుట బొట్టు పెట్టింది–వీరబాల రత్తి ! వీరందొర మరొకమారు తన ప్రాణాధిక ప్రేయసిని బిగి కౌగిట సంభావించి గిర్రుమని తిరిగి కొండవీటి దుర్గం వైపు నడక సాగించాడు.
వీరందొర తిన్నగా దుర్గ గుడికి వెళ్లాడు.
తాను తెచ్చుకొన్న కర్పూరాన్ని దుర్గ ముందర వెలిగించాడు. సాష్టాంగంగా నమస్కరించి , లేచి నిలబడి అన్నాడు,“ దుర్గమ్మ తల్లో ! నీ బిడ్డని, దీవిమ్చు, నాను రత్తి కోరిక తీర్చేందుకు వెళ్తున్నా తల్లో ! నాకు శక్తి పెసాదించు, నా రత్తిని కాపాడు !”
కర్పూరపు జ్వాలలో దుర్గ కంద్లు జ్వలించాయి !
చీకటి బాగా వ్యాపించింది.
వాతావరణం కూడా ప్రేయసి కోర్కెని తీర్చడానికి వీరందొరకి అనుకూలమయింది !
తూర్పు మెరసింది. దాంతో పాటు ఉరుము, దాన్ని అనుసరించి చండ మారుతం, వాతాన్ని అనుసరించి, కారు మబ్బుల కదలిక ! నింగి అంతా అల్లకల్లోలంగా ఉంది.
వీరందొర సముద్రంలో తిమింగళం వలె ఆ కారు చీకటిలో దూసుకొని వెళ్తున్నాడు !
దొర కొండ వెనుక నుండి ఎక్కడం ప్రారంభించాడు. ఒక ప్రక్క ఈటెతోను, మరొక ప్రక్క కృపాణం తోను, బలంమైన విగా నేలని గ్రుచ్చి, ఒక్కొక్క అడుగు వేస్తునాడు అతను.
ఒక చదును జాగాని చేరుకొని నిలబడి, కండ్లు చిట్లించి చూసాడు ! నున్నటి రాతి గోడ– సహజ సిద్ధమైనది, అడ్డు తగిలింది, ఆ మహావీరునికి
వీరందొరకి ఆ ప్రాంతమంతా కొట్టిన పిండి. అక్కడ ఉండే ఒక్కొక్క రాయి వానికి తెలుసు. ఒక మెరుపు మెరిసింది. ఆ వెల్తుర్లో తాను వచ్చిన స్థలం అనుకూలమయినదని పసి గట్టాడు !
వీపుకి కట్టుకొన్న త్రాటి మట్టను తీసాడు. త్రాటికి ఉరి వలయం బిగించాడు. కొన్ని గజాలు వెనక్కి తగ్గాడు. అప్పుడు మళ్లీ మెరిసిన మెరుపు వెలుగులో వానికి కోట బురుజు నిటారుగా కన్పడింది. వలయాన్ని బలంగా త్రిప్పాడు, “జయ దుర్గా !” అని ఉచ్ఛరించి బురుజు మిదకి త్రాడు విసిరాడు.
రివ్వుమని త్రాటి వలయం బురుజుకి తగులుకొంది. వీరందొరకి ‘గిరి’ అనేది జన్మ సిద్ధమైన విద్య !
కొన్ని నిముషాలలో కోట గోడపై కాలుమోపాడు వీరందొర ! దీర్ఘమైన నిట్టూర్పు వదిలి దుర్గకి చేతులెత్తి మ్రొక్కాడు. క్రిందకు చూసాడు. కోట లోని హడావుడి వానికి కన్పించింది. వేలకొలది కాగడాలు కన్పించాయి. తాను నిలుచున్న చోటుకి తిన్నగా క్రిందకి చూసాడు. ఆ చోటు నిశ్శబ్దంగా చీకటితో మంతనం చేస్తూంది.
వీరందొర మరొక త్రాటి చుట్ట విప్పి, బురుజుకి బిగించి క్రిందకి త్రాటిని వేసేసాడు ! దాని సహాయంతో కోట లోపలి భాగానికి వచ్చి నిలుచున్నాడు మహాసాహసి దొరబిడ్డ !
గోడ ప్రక్కనే మెల్లగా అడుగులు వేసుకొంటూ నడిచాడు. –దొర– కొన్ని గజాలు నడక సాగించాడు.
ఎదురుగా కాపలాదారు కవచ ధారియై వస్తూండడం గమనించాడు !
వీరందొర మొలలోని బాకుని తీసాడు ! వస్తున్న సైనికున్ని గురిచూసి ‘జ్య్ దుర్గ’ అని బాకుని విసిరాడు! ఆ బాకుతో పాటు సైనికిడు క్రిందకి దొర్లాడు. వాని ఊపిరి అనంతంలో కలిసింది. ఆ సైనికుని దుస్తులని తాను ధరించి కోట లోని సైనికుల మధ్య చొరబడ్డాడు.
కోటలో హాహాకారాలు మిన్నుముట్టాయి ! శత్రువులు ! శత్రువులు ! కుట్ర, కుట్ర !” అని అరుస్తున్నాడు సింహ ద్వారాన్ని కాపాడుతున్న దళపతి.
వాని అరుపు హఠాత్తుగా ఆగిపోయింది ! కారణం ? వీరందొర అజేయమైన బాకు వాని కంఠ నాళంలో లోతుగా గ్రుచ్చుకొంది. దళపతితో పాటు సైనికులు బెదరిన కుందేళ్ల లాగు, “ శత్రువులు, శత్రువులు కోటలోనికి వచ్చారు” అంటూ కేకలు వేస్తునారు !
వీరందొర మెరుపు వలె నాలుగు ప్రక్కలా ఖడ్గచాలనం చేస్తున్నాడు. శిరస్సులు శరీరాలనుంచి వేరగుతున్నాయి ! వందల కొలది శత్రు సైనికులు కోటలో చొరబడ్డారని భ్రాంతిని పుట్టించాడు, ఆ ఆంధ్ర వీర యువకుడు !
వీరందొర సింహద్వారం యొక్క తలుపుల దగ్గరకి వచ్చాడు. పంటితో కత్తిని కరచుకొన్నాడు ! కుడి కాలుని ఒక బలమైన మేకుకి దన్ను పెట్టాడు ! తన భూజాన్ని తలుపుల అడ్డు దూలానికి ఆనించి ‘జయ్ దుర్గ’ అని మీదకి నెట్టాడు !
ఫెళ ఫెళమనే శబ్దంతో అడ్డు దూలం మీది కెగసి క్రిందకి పడింది !! చేత్తో కత్తిని పట్టుకొని అడ్డు గొలుసుల్ని బలంగా మోదాడు వీరందొర ! శత్రు సైనికులు తండోప తండలుగా వీరందొరపై విరుచుకొని పడ్డారు.
తొలి కోడి కూసింది !!!
శ్రీ కృష్ణ దేవరాయల గజ యూధం కొండవీటి దుర్గం లోకి చొరబడి పోయింది !!
గజ యూధం వెనక విజయనగర సేనావాహిని కృష్ణానదీ ప్రవాహం వలె చొరబడింది.
భయంకరమైన దొమ్మి యుద్ధం చెలరేగింది !
విజయనగర సామ్రాట్టు అన్ని మూలలా తానై సైనిక చాలనం కావించాడు !
వీర వరాహ పతాక జయఘోషల మధ్య కొండవీటి దుర్గంపై రెప రెప లాడింది !!
**************
చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు వీరందొర ప్రక్కగా నిలబడి ఉన్నాడు ! చుట్టూ దళపతులందరూ బారులు తిరి నిలబడి ఉన్నారు ! వీరందొర శరీరం అంగుళమైనా ఖాళీ లేకుండా గాయాలతో నిండి, మోదుగ చెట్టు పూచినట్లు బాలార్కుని కిరణాలలో మెరిసి పోతోంది !
ఆ వీర యువకుని సుందర వదనంలో బాధతో కూడిన హాసం నెలకొంది !“ దండాలు– మా–రాజా ! మాట –నిల–బెట్టు–కొన్నా !మీ –మాట–మాట–”అని పల్కాడు వీరందొర.
చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు , మహామంత్రి అప్పాజీని చూసి, “అప్పాజీ ! ఈ యువకుని త్యాగం నిరుపమానం ! తన ప్రేయసి కోర్కెని తీర్చడానికై ఈ వీర మహావీర సింహం బలి అయిపోయింది. రత్తి కోర్కె చాల అల్పమయినది, కాని ఆమె ప్రియుని త్యాగం మహత్తరమైనది ! వెంటనే ఏడు వారాల నగలతోనూ, పట్ట మహిషి ధరించే మణిమయ కిరీటంతోనూ, రత్తిని అలంకరించి తీసుకొని రండి. ఈ వీర సింహం తన ప్రేయసిని ఆ వేషంలో చూడడానికే శ్వశిస్తూంది !” అన్నాడు.
రత్తిని ఏడు వారాల నగలతోను అలంకరించారు. బంగారు జరీ చీర కట్టబెట్టారు. ఆమె శిరస్సుపై నవరత్న ఖచితమైన కిరీటాన్ని ఉంచారు !
తన రూపాన్ని నిలువుటద్దంలో చూసుకొని మురిసి పోయింది ఆ అమాయిక బాలిక —రత్తి !!
అప్పుడామె రూపం త్రైలోక్య సామ్రాజ్యాన్ని శాసించు ప్రపండ — చండి– ఇంద్రాణి వలె అందరినీ ఆశ్చర్యంలో ముంచింది !
“ నా మాఁవ ఏడుండాడు ?” అని  రత్తి ప్రక్కనున్న చేటిని ప్రశ్నించింది !
అందరూ గుస గుసలాడుకొన్నారు !
“అమ్మగారూ ! మీ మావ ఇక్కడే దగ్గరలో ఉన్నారు–” అంది ఆమె.
ఇంతలో ఒక చేటిక పరుగు పరుగున వచ్చి–“ రత్తమ్మగారిని ఏడు వారాల నగలతో   వెంటనే తీసుకొని రమ్మని, మహామంత్రి తిమ్మరుసుల వారి ఆజ్ఞ !” అని చెప్పింది.
రత్తి మనస్సు కీడుని శంకించింది !
ఆమె వెంటనే తన చిన్న బాకుని తీసుకొని తన గుండెల్లో లోతుగా గ్రుచ్చుకొని , పైట కప్పుకొంది. క్షణ క్షణం వక్షోభాగం రక్తంతో ఎరుపెక్కుతోంది !
ఈ సంభవాన్ని ఎవరూ గమనించలేదు !
***************
“ మాఁవా ! నన్ను చూడు  మాఁవా ! ఏడు వారాల నగలతో వచ్చాను మాఁవా ! నా కోరిక నెరవేరింది మాఁవా !” అని దొర దగ్గరగా నిలబడి ఆక్రోశించింది రత్తి.
వీరందొర కండ్లు విప్పి మందహాసంతో –
“ర–త్తీ ! వీర సొరగం–ఎళ్తున్నా ! నా –అందాల –అందాల –రాశిని  చూసా-! నీ –కోరి -కా, మారాజు– కోరికా– నెరవేర్చా !!!” అని అన్నాడు. తృప్తిగా.
“ మాఁవా ! వీర సొరగం ఒంటరిగా పోమాక ! నీ రత్తి నీ వెంట వస్తాది  మాఁవా !  మాఁ –వా !–” అని ఎలుగెత్తి పలికి వీరబాల రత్తి, దొర గుండెలపై దొర్లి పడిపోయింది !!!
ఆ వీర మిథునం ప్రాణాలు అనంతంలో కలిసి పోయాయి !!! చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు కొనగోటితో తన కన్నీటిని ఎగజిమ్మి ఆ వీర మిథునానికి సైనిక అభివాదం కావించాడు !
అందరూ తమ ప్రభువుని అనుసరించారు .

**************

 

ఏ నావదే తీరమో…

రచన: సురేశ్ పెద్దరాజు.

మ్రోగే మొబైల్ ఫోనుపైనున్న లాండ్ లైన్ నెంబర్ చూసి ఎవరు చేశారా అనుకుంటూ తీసి హల్లో అన్నాడు రఘురామ్. ఎవరూ మాట్లాడక పోయేసరికి ఇంకోసారి హల్లో అన్నాడు.
మరికొన్ని సెకన్ల తరువాత “నేను హారికను” అని చిన్నగా వినిపించింది అటువైపునుంచి.
“హేయ్ హారిక ఎక్కడికి పోయావు వారంరోజుల నుంచి? ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది. మీ ఆఫీసుకు వెళ్తే రావట్లేదని చెప్పారు. ఏమయ్యావు? ఇక నేనే మీ ఇంటికి వద్దామని డిసైడ్ అయ్యాను. ఇంతలో నువ్వే చేశావు. అవునూ… లాండ్ లైన్ నుంచి చేస్తున్నావు. మీ ఇంటిది కూడా కాదు. నీ సెల్ ఫోన్ ఏమైంది? ప్రశ్నల వర్షం కురిపించాడు రఘు.
“రఘు ముందు నేను చెప్పేది విను. ఇకపై మనం కలవడం కుదరదు. ఇంట్లో నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.”
“మరి మన ప్రేమ??”
“మరచిపోవడమే. నేను వారంరోజులుగా అదే ప్రయత్నంలో వున్నాను. నువ్వు కూడా నన్ను మరచిపో. ఇది చెప్పడానికే ఫోన్ చేశాను.”
“లేదు హారికా….అలా ఫిక్స్ అయిపోకు. నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను.”
“వేస్ట్…ఇంటర్ కాస్ట్ మ్యారేజికి మా ఇంట్లో చచ్చినా ఒప్పుకోరు. అందులోనూ మాకన్నా తక్కువ కులం వాడవివని నిన్ను అవమానిస్తారు.”
“అన్నీ తెలిసే ప్రేమించావుగా నీవు…ఇప్పుడిలా మాట్లాడుతావేంటి?”
“తెలుసో, తెలీయకో ప్రేమించాను. కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా మావాళ్ళకు వ్యతిరేకంగా నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను.”
“అలా అనకు హారికా…ఓసారి కలసి కూర్చొని మాట్లాడుకుందాం. ఈరోజు సాయంత్రం కాఫీడేలో కలుద్దాం సరేనా?”
కాసేపు మౌనం తరువాత “నాకు రావడం కుదరదు. నేను చెప్పాల్సింది చెప్పాను. వుంటాను…గుడ్ బై!” అని ఫోన్ కట్ చేసిన శబ్దం వినపడింది.
ఆందోళనకు గురైన రఘు తిరిగి అదే నెంబరుకు తన ఫోన్ నుంచి చేశాడు. ఫోన్ తీసిన వాడు. ఇది పబ్లిక్ టెలిఫోన్ అని, ఇప్పుడే ఓ అమ్మాయి మాట్లాడి వెళ్ళిపోయిందని చెప్పాడు.
పిచ్చి కోపంతో ఫోనును నేలకేసి కొట్టాడు. ఆ శబ్దానికి పక్కగదిలో వున్న రఘు వదిన భవాని తన గదిలోకి వచ్చింది.
కింద పడిన సెల్ఫోన్ భాగాలను ఒకొక్కటి ఏరుతూ “ఎందుకంత కోపం? ఎవరిమీద?” అంటూ అడిగిందామె.
కళ్ళల్లోని కన్నీటిపొరను చూపలేక తల పక్కకు తిప్పుకున్నాడు రఘు.
“రఘు… ఏమైంది?”
ఏమీ మాట్లాడక మౌనంగా వుండిపోయాడు.
“అరే అడుగుతోంది నిన్నే…అంటే నాతో చెప్పకూడదా?”
“నీతో కాక నేను ఇంకెవరికి చెప్పుకుంటాను వదినా నా బాధలు” అంటూ ఇందాక హారిక ఫోన్ సంగతి చెప్పాడు.
రఘు, హారిక రెండేళ్ళ క్రితం జరిగిన జాబ్ మేళాలో మొదటిసారి కలిశారు. ఇద్దరూ వేర్వేరు కంపెనీలలో ఉద్యోగం సంపాదించారు. అలా ఏర్పడిన పరిచయం మొదట స్నేహంగా మారి ఆరునెలల్లో అది ప్రేమకు దారితీసింది. మూడు నెలల క్రితం వరకూ సినిమాలు, షికార్లతో బాగానే గడిపారు. ఇక ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్ళికి ఒప్పిద్దామనుకునేంతలో అనుకోని మలుపు. అంతవరకూ బెంచ్ పై వున్న రఘు ఉద్యోగం కంపెనీ ఇచ్చిన పింక్ స్లిప్ తో వూడింది. తరువాత ఉద్యోగానికై చాలా ప్రయత్నాలే చేశాడు…చేస్తున్నాడు కానీ పొందలేకపోయాడు. రాను రాను హారిక అతనికి దూరం జరగసాగింది. ఆమెలో వస్తున్న మార్పును గమనించి ఉద్యోగంలో జాయినయితే అన్నీ సర్దుకుంటాయిలే అని సరిపుచ్చుకున్నాడు. ఇప్పడు వున్నట్టుండి హారిక ఇచ్చిన ఈ ట్విస్ట్ ను భరించలేకున్నాడు.
వీరి ప్రేమ సంగతి రఘు ఇంట్లో అతని వదినకు తప్ప ఇంకెవరికీ తెలీదు.
“ఏంటి వదిన తను ఇలాంటి డెసిషన్ తీసుకుంది.” అడిగాడు రఘు ఏడుపు మొఖంతో.
“ఈ కాలపు అమ్మాయిలు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు రఘు. ముందులా గుడ్డిగా అబ్బాయిల వెంట నడవట్లేదు. నీకు జాబ్ వుంటే కులం వేరైనా ఇంట్లో ఒప్పించవచ్చు అనుకుంది. నీకు జాబ్ పోయేసరికి అది కష్టం అనిపించి వుండొచ్చు. ఇక ఇంట్లో కూడా ప్రెషర్ వుండిడొచ్చు. ఈ బాధలన్నీ ఎందుకు హాయిగా ఇంట్లో వాళ్ళు చూపించిన వాడిని చేసుకోక అని డిసైడయి పోయుంటుంది.”
“నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తావా వదినా…మీ అడవాళ్ళంతా ఇంతే” నిష్టూరమాడాడు రఘు.
“నేను తనని సపోర్ట్ చేయట్లేదు. నీకు వాస్తవం వివరిస్తున్నాను. నీకు మళ్ళీ జాబ్ వచ్చేంతవరకు తను వేచి వుండే పరిస్థితి వుండకపోవచ్చు. తను ఈ నిర్ణయానికి రావడానికి నిన్ను కలవని ఈ వారం రోజులు ఆలోచించి వుంటుంది.   ఈ కాలం ఆడపిల్ల పెళ్ళి విషయంలో, జీవిత భాగస్వామి నిర్ణయించుకోవడంలో చాలా ఆలోచిస్తుంది రఘు”
“ఆ… అవును ఆడపిల్లలకే వుంటాయి మరి…మాకు ఏ ఆలోచనలు వుండవు. తనతో కలసి జీవించబోయే జీవితాన్ని ఎంతగా వూహించుకున్నాను. ఇలా మధ్యలో వదిలేసి వెళ్తాదని వూహించలేకపోయాను.” అంటూ మూగగా రోదించాడు.
“ఛ..ఆడపిల్లాలా అలా ఏడవడమేంటి? నేను కలసి మాట్లాడేదా తనతో” అడిగింది భవాని.
ఏమీ సమాధానం ఇవ్వలేక కిటికీ గుండా బయటకు అలాగే చూస్తుండిపోయాడు రఘు.
తరువాతి రెండురోజుల్లో హారికను కలవడానికి భవాని చాలా కష్టపడవలసి వచ్చింది. అప్పటికే తనకి నిశ్చితార్థం జరిగిపోయిందని, ఆ నిశ్చితార్థం రోజే చివరిగా రఘుతో మాట్లాడిందని తెలిసింది.
షాక్ నుంచి కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది రఘుకు. తల్లిదండ్రులు, అన్నావదినలు ఎన్నోరకాలుగా చెప్పాక తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నెలరోజులకి ఒక చిన్న కంపెనీలో జాబ్ సంపాదించాడు. అలా తను జాబులో బిజీ అయిపోయి తిరిగి గాడిలో పడ్డాక అతనికి పెళ్ళిసంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లోవాళ్ళు.
చాలా రకాల వడబోతల తరువాత కొన్నింటిని సెలెక్ట్ చేసి ఫోటోలను రఘుకు చూపించారు. మీరు వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అన్నాడు రఘు. చివరికి బలవంతం మీద మొదటిసారి పెళ్ళిచూపులకు వచ్చాడు.
ఆమ్మాయి పేరు ప్రవల్లిక. బియస్సీ చదివింది. బాగానే వుందనిపించింది అందరికి. నీవేమంటావ్ అన్నట్టు చూసింది రఘుని అతని వదిన. ఏమీ మాట్లాడకపోయేసరికి తనుతో మాట్లాడతావా అని అడిగింది. ఊహు అని రఘు అడ్డంగా తలూపుతుండగా ఇంతలో…
‘ఇద్దరిని వదిలేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం అలా కాస్త బయట వరండాలోకి వెళ్దామంటూ లేచాడు’ రఘు అన్న ఈశ్వర్. నిముషంలో అందరూ గది బయటకు వెళ్ళారు.
రఘు, ప్రవల్లిక మిగిలారు అక్కడ. ఇద్దరి మద్య కాసేపు మౌనం. ముందుగా రఘునే మాట్లాడుతూ , “మీరు పీజీ చెయ్యాలనుకుంటున్నారా? లేకపోతే  ఇక్కడతోనే ఆపేస్తారా?” అడిగాడు.
“ఇంకా చదవాలనివుంది” అంది ప్రవల్లిక.
అలా అయిదునిముషాల పాటు తనకి తోచిన ప్రశ్నలు అడిగాడు. తనకు తోచింది మాట్లాడాడు. కాని తనంతకు తానుగా ఒక్క మాట మాట్లాడలేదు. అడిగిన వాటికి కూడా ముక్తసరిగా సమాధానమిచ్చింది. బిడియస్తురాలిగా అనిపించిందతనికి. ఇక తరువాత మాట్లాడడానికి ఏమీ తోచక బయటకు వచ్చేశాడు రఘు.
వెళ్ళిన తరువాత ఏ విషయం తెలియజేస్తామని వచ్చేశారు.
తరువాత మిగతా వాళ్ళని కూడా చూశాక మొదట చూసిన అమ్మాయే రఘుకు సరైన జోడి అనుకున్నారు అందరూ. నీవేమంటావ్ రఘు అడిగింది భవాని. ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రఘు.
మరుసటి రోజు ప్రవల్లిక తల్లిదండ్రులకు  ఫోన్ చేసి ‘మాకూ, మాఅబ్బాయికీ  మీ అమ్మాయి నచ్చింది. మరి మీకు, మీ అమ్మాయికి మావాడు నచ్చాడా?’ అడిగారు. ‘నచ్చకపోవడానికేముంది, మీ సంబంధం మాకు అన్నివిధాల నచ్చిందంటూ మిగిలిన విషయాలు మట్లాడుకోవడానికి తొందరలో మీ ఇంటికి వస్తామన్నారు అమ్మాయి వారు.
ఆ తరువాత నుంచి రఘులో వచ్చిన హుషారుని గమనించారు ఇంట్లో వాళ్ళు. పెళ్లికళ వచ్చేసిందని ఆటపట్టించారు అతన్ని. అన్నీ మంచి శకునములే అని మురిసిపోయారు.
రఘు ఆఫీసులో సిస్టం ముందు కూర్చోని పని చేసుకుంటున్నాడు. ఇంతలో “రఘు, మిమ్మల్ని కలవడానికి మిస్ ప్రవల్లిక వచ్చారు” అంటూ రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి చెప్పింది.  విని ఆశ్చర్యపోయిన రఘు ఎందుకు వచ్చిందా అనుకుంటూ రిసెప్షనుకు వచ్చాడు.
ప్రవల్లికను నవ్వుతూ పలకరించి రండి కాంటిన్ వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తనని తీసుకెళ్ళాడు.
తనని ఓ టేబుల్ దగ్గర కూర్చుండబెట్టి ఏమి తీసుకుంటారు అని అడిగాడు. తనకేమీ వద్దంది ప్రవల్లిక. అలాగెలాగ ఏదోకటి తీసుకోవాలి అంటూ వెళ్ళి రెండు కాఫీ కప్పులతో వచ్చి కూర్చొని తనకి ఒకటి అందిస్తూ “చెప్పండి ఏమిటిలా వచ్చారు? ఏదైనా మాట్లాడాలా?” అడిగాడు రఘు.
“మీరు నన్ను ఓకే చేశారు కదా ….కానీ నా కిష్టం లేదు మిమ్మల్ని చేసుకోవడానికి” సూటిగా వచ్చింది ఆమె నుంచామాట.
పెదవుల మధ్య పెట్టుకున్న కప్పులోని కాఫీ లోనికి తొణికి రఘు నాలిక సుర్రుమంది. కొన్ని క్షణాల మౌనం తరువాత “ఈ విషయం మీ ఇంట్లోనే చెప్పొచ్చు కదా…నాదాక రావడం ఎందుకు?” అన్నాడు.
“ఇంట్లో చెప్పలేకే కదా మీ దగ్గరకు వచ్చింది”
“అంటే..ఇప్పుడు మీరు నాకు నచ్చలేదని మీవాళ్ళకు చెప్పాలి…అంతేనా!”
“అంతే!”
“సరే అయితే…. ఇలా నాతోనే చెప్పించడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా!”
“నేను ఇంకొకరి ప్రేమిస్తున్నాను. పెళ్ళి చేసుకోవడానికి కాస్త సమయం కావాలి. తను ఇంకా సెటిల్ అవ్వలేదు. అయ్యాక మా ఇంట్లోవాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది.”
ఖిన్నుడైన రఘు తనకు జరిగిన అనుభవం తలుచుకున్నాడు. దానికి పూర్తీ వ్యతిరేకంగా వుంది ఈమె వ్యవహారం. ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకోవాలని, ప్రేమను గెలిపించుకోవాలన్న ఆమె సంకల్పాన్ని మనసులోనే అభినందిస్తూ మళ్ళీ తన పరిస్థితి మొదటికి వస్తున్నందుకు చిన్నగా నిట్టూర్చాడు.
“మరి ఆరోజు మనమిద్దరం వున్నప్పుడే చెప్పిండొచ్చు కదా..విషయం ఇంతదాకా వచ్చుండేది కాదు.”
“మీకు నేను నచ్చనులే అనుకున్నాను. నచ్చానని చెప్తారనుకోలేదు”
అవును నాదే  తప్పు …మీ అమ్మాయిలున్నారే…ఎందుకులే…హ్మ్ అని మనసులోనే వగరుస్తూ… “మీరు నిశ్చింతగా వుండండి. మీరు చెప్పమన్నట్టే చెప్తాను. మీ ప్రేమకు ఆల్ ద బెస్ట్!” చెప్పాడు రఘు.
“థాంక్స్” చెబుతూ వచ్చినపని అయ్యిందని పైకి లేచింది ప్రవల్లిక.
“కాఫీ తీసుకోండి!”
“నో థాంక్స్! ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ…..అసలు నేను కాఫీ తాగను” అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
ఇంటికెళ్ళాక జరిగినది ఇంట్లో వాళ్లకి చెప్పి తనకు ప్రవల్లిక నచ్చలేదన్న విషయం వారిచేత ఫోన్ చేయించి చెప్పించాడు రఘు.
“అప్పుడేమో ప్రాక్టికల్గా ఆలోచిస్తారన్నావు. మరి దీనికేమంటావ్ వదినా!” అని అడిగాడు భవానిని.
“ఏమంటాను…లవరికి చేసిన ప్రామిస్ నిలబెట్టుకోవడం అంటాను!”
“చూశావా మళ్ళీ ఈమె విషయంలో కూడా తనవైపునే మాట్లాడుతున్నావ్. మీ ఆడవాళ్ళంతా ఇంతే ఎప్పుడూ మగవాడిని దోషిని చేయాలనే చూస్తారు”
“ఏది జరిగినా మన మంచికే అనుకోవాలబ్బాయ్. ఇన్ని తప్పిపోతున్నాయంటే ఏ అపరంజి బొమ్మనో నీకోసమే పుట్టించి వుంటాడు దేవుడు…తను నీరాకై ఎదురుచూస్తున్నదేమో ”
“ఆ..ఆ సరే ఇక మీరు ఏ అపరింజిని, పుత్తడిని వెతక్కండి. అయినప్పుడు అవుతుంది. కాకపొతే ఇలాగే వుంటా!” అంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు రఘు.
వెళుతున్న రఘుని చూస్తూ ఎక్కడ, ఎవరితో రాసిపెట్టుందో అనుకుంటూ నిట్టూర్చింది భవాని.
తరువాత నెల రోజులకు వచ్చిన మాఘమాసంలో రఘు చుట్టాల పెళ్ళికై రాజమండ్రి దగ్గరున్న పట్టిసీమకు వచ్చారందరూ. రాను రానని అంటున్నా రఘును కూడా లాకొచ్చారు.
దాదాపు పుష్కరకాలం తరువాత ఆ వూరోచ్చాడు రఘు. అది వారి అమ్మమ్మ వూరు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నా రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ప్రతి సెలవలకి ఆ వూరు వచ్చేవాళ్ళు. అమ్మమ్మ పోయాక మళ్ళీ ఈ వూరివైపే రాలేదు. తిరిగి ఇన్నాళ్ళ తరువాత దూరపు చుట్టం. మామయ్య వరసయ్యే కూతురి పెళ్ళికి రావడం. ఆయనికి ఇద్దరి కూతుళ్ళు. ఇప్పుడు పెళ్ళవుతోంది వారి పెద్దమ్మాయికి.
గోదారిని చూస్తుంటే చిన్నప్పుడు గట్టుపక్కన ఆడుకున్న సంగతులన్నీ గుర్తుకురాసాగాయి రఘుకి. అలా గత స్మృతులను నెమరేసుకుంటున్నాడు.
ఇంతలో “హాయ్ బావ” అన్న గట్టిగా అరిచిన పిలుపుకి వులిక్కిపడి తిరిగి చూశాడు.
మొదట గుర్తుపట్టలేదు తనని. ఎవరీ అమ్మాయి అని ఆలోచిస్తూండగా “నేను బావ మధుని. మర్చిపోయావా? అన్నది.
“మధూలిక కదూ ఆ… ఆ గుర్తొచ్చింది!” నవ్వుతూ బదులిచ్చాడు.
మధూలిక పెళ్ళికూతురి చెల్లెలు. అంటే రఘుకు వరసకి మరదలు.
“అంతేలే పట్నమోడివి కదా చిన్నప్పటి స్నేహితులను మరచిపోవడం మామూలే!”
“అబ్బా అది కాదులే మధు. ఇన్నేళ్ళ తరువాత చూస్తున్నా కదా వెంటనే స్ట్రైక్ అవ్వలేదు అంతే!”
ఇక అక్కడున్న ఆ మూడురోజులు ఒకటే కబుర్లు. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ అరమరికలు లేకుండా మాట్లాడే మధూలికను చూసి అందరికీ ముచ్చటేసింది. రఘు అమ్మ ఈ అమ్మాయి తన కోడలైతే బాగుండునని, అతని వదిన తన తోడికోడలు బాగుండునని ఒకేసారి అనుకున్నారు.
ఇక వుండబట్టలేక చివరికి మధూలికను అడిగేసింది భవాని “మా రఘును పెళ్ళిచేసుకుంటావా అని.
“వాడినా నేనా?…ఏదో చిన్నప్పటి నుండి తెలుసు పైగా దూరపు చుట్టం అని కాస్తా చనువుగా వున్నంత మాత్రాన ఇష్టపడుతున్నట్టు మీకు మీరే అనుకొని పెళ్ళి చేసుకుంటావా అని అడగడం బాలేదు అక్కా…హ్మ్” అంటూ చిరాగ్గా మొహం పెట్టుకొని వెళ్ళిపోయింది మధూలిక.
హ్మ్…ఏమో అనుకున్నాను. బాగానే వుంది టెక్కు. నా మరిది కంటే మంచివాడు దొరుకుతాడా…పెద్ద బడాయి పోతోంది అనుకుంది భవాని.
పెళ్ళి తరువాత అందరూ సీతారాముల దర్శనానికి లాంచిలో భద్రాచలం బయలుదేరారు. రఘు వాళ్ళ కుటుంబం కూడా వారితో వెళ్ళింది. ఇక అక్కడునుండే హైదరాబాద్ రావాలని ప్లాన్ చేసుకున్నారు.
సీతారాముల దర్శనం తరువాత ఏటి గట్టుకు వచ్చారందరూ. రఘు వాళ్ళు హైదరాబాదు బయలుదేరడానికి ఇంకా మూడుగంటలు వుంది. అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. వారిని వదిలి రఘు అలా తీరం వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాడు.
“బావా వుండు నేనూ వస్తున్నాను” అంటూ మధు వెనకనుండి పరిగెట్టుకు వచ్చింది.
“ఎందుకలా పరిగెట్టుకు రావడం. చిన్నగ రావొచ్చు కదా!”
“చిన్నగా వస్తే నువ్వందవు కదా”
ఆమె మాటలో ఏదో కొత్త అర్థం ధ్వనించింది అతనికి. క్షణంపాటు ఆగి తలతిప్పి తనని ఓసారి చూసి మళ్ళీ నడక ప్రారంభించాడు. సూర్యుడు నెమ్మదిగా పడమర దిక్కుకు వాలుతున్నాడు. ఏటిపై నుండి వచ్చే పిల్లతెమ్మరులు వారిని తాకుతున్నాయి. ఆహ్లాదకరంగా వుంది వాతావరణం.
పక్కన నడుస్తున్న మధూలిక కాసేపయ్యాక “బావా నిన్నొకటి అడగాలని వుంది” అన్నది.
“ఊ.. అడుగు ఇంకెందుకు ఆలస్యం”
నడుస్తున్న ఆమె ఆగిపోయి “బావా నన్ను పెళ్ళిచేసుకుంటావా!” అన్నది
నడుస్తున్న రఘు ఆగి వెనక్కి తిరిగి అమాయకమైన ఆమె మొహంలోకి అలాగే చూస్తుండిపోయాడు.
ఎంతకీ మాట్లాకపోయేసరికి “ఏం బావ…ఈ పల్లెటూరి పిల్లను చేసుకోవడం ఇష్టం లేదా?”
“ఛ అలాంటిదేమీ లేదు మధు. నీకేంటి స్వాతిముత్యనివి. ఇష్టమున్న దానివి  మరి వదినతో ఎందుకలా చెప్పావంట”
“ఓ.. అదా వూరకే చిన్న జలక్ ఇచ్చాను. నా ఇష్టాన్ని నేరుగా నీకే చెబుతామని” చిలిపిగా నవ్వుతూ అన్నది.
మళ్ళీ తనే మాట్లాడుతూ “బావా నువ్వంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం తెలుసా! అక్క పెళ్ళయ్యాక నేనే నాన్నను అడుగుదామని అనుకున్నాను. అదృష్టం బాగుండి మీరందరూ పెళ్ళికి వచ్చారు. ఈరోజు విషయం ఆటో ఇటో తేలిపోవాల. ఇంకా నీ గురించి ఆలోచిస్తూ ఊహల్లో తెలిపోలేను బాబు!”
ఆమె మాటలు వింటుంటే రఘుకి ఆశ్చర్యమేసింది. నా గురించి ఇంతగా ఆలోచించే ఆడపిల్ల వుందా అదీ ఎప్పటినుంచో.. తలుచుకుంటుంటే గర్వమేసింది అతనికి
కానీ వాస్తవం చెప్పాలని ప్రేమ, పెళ్ళి విషయంలో తనకు ఇంతకుముందు జరిగిన రెండు అనుభవాలను చెప్పాడు.
విన్న మధూలిక చాలా తేలిగ్గా తీసుకొని “వారికి నిన్ను చేసుకొనే అదృష్టం లేదు బావ. ఆ అవకాశం నాకు కల్పించారమో ఆలోచించు” అన్నది.
ఆలోచిస్తుంటే అవును నిజమే తనకోసమే నాకు ఇంకెవరితో పెళ్ళవకుండా అట్టిపెట్టాడేమో దేవుడు అనిపించింది అతనికి.
“నన్ను చేసుకోవడం ఇష్టమేనా? పర్లేదు బావా చెప్పు! నువ్వు అవునన్నా కాదన్నా పెద్దగా ఇదవ్వను. ఆ ఇద్దరిలాగే నాకూ అదృష్టం లేదనుకుంటాను”
రఘు ఓసారి చుట్టూ పరికించి, తిరిగి తన కళ్ళలోకి చూస్తూ “ఇష్టమే” అన్నాడు.
“ఆ… ఆ మళ్ళీ ఓసారి చెప్పు!”
“మధూ నిన్ను పెళ్ళిచేసుకోవడం నాకు ఇష్టమే!”
విన్న మధూలిక బుగ్గలు ఎరుపెక్కాయి. పడమటి దిక్కున ఆకాశం కూడా అదే రంగును పులుముకుంది. మరో అందమైన రాత్రికి స్వాగతం చెబుతూ క్షితిజరేఖ దిగువుకి చేరుకుంటున్నాడు సూరీడు. వర్ణశోభితమైన ఆ దృశ్యాన్ని ఆమె కళ్ళు తిలకిస్తూ వుంటే, చెవులు సంధ్యారాగాన్ని ఆలకిస్తూండగా, ఆమె గుండె నిండు గోదారిలా చిందులేయసాగింది.
ఆయ్…బావ ఒప్పేసుకున్నాడు అని సంబరపడిపోతూ థాంక్యూ బావ అని చెయ్యందించి వెంటనే వెనుతిరిగి ఈ విషయం తన వాళ్లకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ పోయింది
గట్టున సైకిలుపై వెళుతున్నతని రేడియో నుండి “ ఏ నావదే తీరమో…ఏ నేస్తమే జన్మ వరమో” మార్దవం నిండిన గొంతులో ఏసుదాసు పాట వినపడుతోంది.
తనని సరైన దరికి చేర్చినందుకు, తన చిన్ననాటి స్నేహాన్నే జీవిత భాగస్వామి అయ్యే

 

” భార్యా భర్తల బంధం “

రచన : శర్మ జి ఎస్
పెళ్ళైన కొత్తలో తను  ఇంటికి కావలసినవి చెప్తుంటే ,  నాకన్నీ తెలుసును,  మా ఇంట్లో ఏది కావలసిన నేనే చూసే
వాడినని అన్న వసంతరావు, నేడు నీ ఎం ఏ ఆలోచనల ముందు , నా బి ఏ ఆలోచనలే మూలకు, కనుక అన్ని
విషయాలలో నీదే ఫైనల్ నిర్ణయం  అంటుంటే   ఆశ్ఛర్యపోతున్నది వసుంధర.
అతనిలొని ఈ మార్పుకి కారణం  ఆలోచించసాగింది.
ఈ భావన అతనిలో మొదటినుంచి లేదు.హాయిగా, చాలా సరదాగా ఉండేవాడు. ప్రతి విషయంలోను అతనే
నిర్ణయం చేసేవాడు.  అతను అలా వుండటమే , తనకెంతో ఆనందాన్ని కలిగించేది.  అలా ఉన్న నాడు
తను ఏదైనా కావాలంటే అతను వద్దన్నా , తను  బాధపడలేదు.
బి ఏ కంటే, ఎం ఏ ఎక్కువే గదా. కనుక నీకంటే , నీ భార్యే ఎక్కువ అని ఎవరో నూరిపోశారు.  అందువల్లే యిలా మాట్లాడు
తున్నారు. ఎలాగైనా ఈ భావన నుంచి అతనిని బయటపడేయాలి. ఎంత తక్కువ చదువు  చదివినా , భర్త  అంటె భార్య కంటే
ఎక్కువే అని తెలియచేయాలి. భార్య ఎక్కువ చదువు చదివిందువలకు ,తన ఆలోచనలని, తెలివితేటలని  సక్రమంగా ఉపయో
గించాలి. లేకుంటే ఆ ఉన్నత చదువులకి అర్థమే లేదు
*      *     *
ఏమండీ  మన వయసు పెరుగుతున్నట్లుగా , ఖర్చులు పెరుగుతాయి. నేనెంత ట్యూషన్స్ చెప్పినా , ఈ సంపాదన అప్పుడు
చాలదండి.  అందుకని ఓ పని చేద్దామా ?
నిజంగా తన భార్య తనకంటే బాగా ఆలోచిస్తున్నది ఇంటిగురించి , తనకంటే పై చదువులు చదవటం వలన అని
మనసులోనే అనుకొంటూ , అయితే ఏం చేద్దామంటావ్ ?
ఉన్నత చదువులకు ఉన్నతమైన ఉద్యోగాలు లభిస్తాయి. మీరు ఐ ఏ ఎస్ కి ప్రిపేర్ కండి.  అపుడు ఈ సమస్యలకు సులువుగా
పరిష్కారం  దొరికినట్లే. ఏమంటారు ?
నేను ప్రిపేర్ కాగలనంటావా ?
నేనూ , మీ ప్రక్కనే ఉంటాగా. ఇరువురం ప్రిపేర్ అవుదాం. చక్కగా వ్రాయగలరు.
అలాగే, అన్నీ రెడీ చేయి.
ఆ సమాధానం విన్న వసుంధర సంతోషించి , ఈ క్షణం నుంచి ఆ పనిలో నిమగ్నమై ఉంటా అన్నది.
*     *    *
వసుంధరా నువ్వు ప్రిపేర్ అవుతున్నావా ? లేదా ?  పరీక్షలు  ఎంత దూరంలోనో లేవు. రెండే రెండు వారాల టైం మాత్రమే
ఉంది. ఎక్కువ కష్టపడి చదవాలి.
ప్రిపేర్ అవుతాలెండి .
అయినా నాలాగా నువ్వు శ్రమ పడి చదవవలసిన అవసరం లేదనుకుంటా. అందుకే అంత శ్రధ్ధ చూపిస్తున్నట్లు లేదు ,
అదేమీ కాదండి, టెంత్  క్లాస్, ఫష్ట్ యియర్ , సెకండ్ యియర్ ఇంటర్మీడియెట్ విద్యార్ధుల ఎక్జాంస్ కదా వచ్చే నెలలో
వాళ్ళను ప్రిపేర్ చేస్తున్నా. అందుకే కొంచెం శ్రధ్ధ తక్కు వైన మాట నిజమేనండి.
ఎవరి గురించి వాళ్ళాలోచించాలంటావుగా ఎప్పుడూ.  ముందు నీ గురించి ఆలోచించు, వాళ్ళ గురించి కాదు.
ఆ మాట నిజమే . కాకుంటే ఇపుడు నా ఒక్కదాని కొఱకు , ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుని పాడు
చేయటం నాకిష్టం లేదండి. అయినా ఇంకా రెండు వారాలున్నాయిగా, ప్రిపేర్ అవుతాలెండి. టెన్షన్ పడక , మీరు
చక్కగా ప్రిపేర్ అవ్వండి.
నేను ప్రిపేర్ అవుతూ , నీకొకమారు గుర్తు చేశానంతే. నీ మాటకు ఎదురు చెప్పను.
అలాగేనండి.
*      *      *
ఏమండోయ్ ఈ రొజు మన ఐ ఏ ఎస్ రిజల్ట్స్ వస్తాయటండి . మీరు ఇంటర్నెట్ లో చెక్  చేసి  చెప్పండి అన్నది
వసుంధర ఫోను లోనే.
చెప్తాలే అని ఫోను పెట్టేశాడు.ఇంటర్నెట్ లో చూడటం ఆరంభించాడు.
మొదట వసుంధర నంబరుని ఫష్ట్ గ్రేడు లో చూశాడు . నంబరు లేదందులో. సెకండ్ గ్రేడు లో చూశాడు, అక్కడా
లేదు. థర్డ్ గ్రేడు లో కూడా చూశాడు. అక్కడా లేదు. ఆశ్ఛర్యం ఆతని వంతు అయింది.తనకు ఏం చెప్పాలో అర్థం
కాలేదు. తను కంటిన్యువస్ గా మొబైల్ కి కాల్ చేస్తూనే వున్నది. ఇంక తప్పని సరై మొబైల్ ఆన్ చేసి ,  సారీ
వసుంధర ఏం చెప్పాలో తెలియటం లేదు అన్నాడు బాధగా.
చెప్పండి. మీ నంబరు లేదా ?
నా నంబరు దాకా పోయావు , నీ నంబరే లేదు .
నా నంబరు లేదా ? మఱి మీ నంబరు …… ?
నీ నంబరే లేకుంటే , నా నంబరెందుకుంటుంది , అందుకే ఇంకా నే చూడలేదు.
చూసి ఫోన్ చేయండి ఆలస్యమైనా ఫరవాలేదు.
నువ్వే పాస్ కాకుంటే , నేనెలా అవుతాను ?
ఎవరి లక్కు వారిది , ఎక్జామ్ కి అటెండ్ అయినందుకైనా ఓ మారు  మీ నంబరు కొరకు  చూడండి.
సరే చూస్తాను .
మఱలా ఇంటర్నెట్ రిజల్ట్స్ లో తన నంబరు ఉందేమోనని చూడటం ఆరంభించాడు థర్ద్ గ్రేడు నుంచి , లేకపోవటంతో ,
సెకండ్ గ్రేడు లో చూశాడు, అందులోనూ లేదు. ఫష్ట్ గ్రేడ్ లో చూశాడు. నమ్మలేక పోయాడు తన కళ్ళని తానే.
కళ్ళు నులుపుకొంటూ ఒకటికి నాలుగు మార్లు పరీక్షగా చూశాడు. అది తన నంబరే.
వసుంధర నంబరు ఏ గ్రేడ్ లో లేకపోవటం ,తన నంబర్ ఫష్ట్ గ్రేడ్ లో ఉండటం ఒక ప్రక్కన బాధ , మఱో ప్రక్కన పట్టలేని
ఆనందం ఒక్కసారే అతనిలో చేరాయి. వెంటనే ఇంటికి చేరుకొన్నాడు.
వసుంధరా, నా నంబర్ ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నదే .
ఫస్ట్ గ్రేడా ?  కంగ్రాట్స్ అంటూ నోటిని తీపితో ముంచేసింది.
ఇదంతా నీ ప్రతిభే. నేనే నిన్ను అభినందించాలి.
లేదండీ ఇదంతా మీ క్రుషేనండి. నా ప్రతిభే అయితే , నేనూ పాస్ అయ్యేదాన్నిగా .
నిజమే నువ్వెలా పాస్ అవుతావ్ ? ఏనాడైనా శ్రధ్ధ తీసుకొని ఉంటేగా. విడిగా నువ్వెంత   శ్రధ్ధగా చదివాన్నది కాదు ప్రధానం.
ఎక్స్చేంజ్ లో రెన్యువల్ , ఎక్జాంస్ లో రివిజన్ తప్పనిసరి .ఎన్నిసార్లు గుర్తు చేశానో, సినా ,నువ్వు చదివిందేం లేదుగా!
రిజల్ట్సే సాక్ష్యం.
నిజమేనండి .
వసుంధర ఎం ఏ , వసంతరావు ఐ ఏ ఎస్ . మనిరువురిలో నేనే పెద్ద చదువు చదివింది. నేనే గొప్ప. ఇన్నాళ్ళు నేను ,
నీకంటే  తక్కువ చదువు చదివానని, ఏవేవో వెఱ్ఱి కూతలు కూసిందీ లోకం .  ఇంతదాకా నన్ను వేలెత్తి చూపిన ఈ
లోకానికి సరైన సమాధానం చెప్తాను.
రేపో , మాపో ఐ ఏ ఎస్ ట్రైనింగ్ కి వెళ్తాను. ఆపుడు ఈ నోళ్ళన్నీ ఎలా మూసుకుపోతాయో చూడు తనలోని ఇన్నాళ్ళ
అగ్నిని వెలుపలకి వెళ్ళగక్కాడు.
మీరు పాసయినందుకు , నేను పాసయినదానికంటే పది రెట్ల ఆనందం పొందుతున్నానండి.
చాలాకాలం తర్వాత యిన్నాళ్టకి ఈ నాడు తన భర్తలోని ఆధిక్యతను చూడగలిగింది. ఇదే ఇన్నాళ్ళు తనకు కరువైంది.
వాస్తవంగా ఈ ఎక్కువ, తక్కువలు  మన ( భార్యా భర్తల ) వ్యక్తిగత విషయం.
నిజానికి నాకు ఏ ఉద్యోగం చేయాలని లేదు. నేను  పాసయితే , నాకూ ఎక్కడో ఓ చోట పోస్ట్ వేస్తారు. అప్పుడు నేనో
చోట , మీరో చోట ఉండిపోవాల్సి వస్తుంది. నాకది ఇష్టం లేదు. నాక్కావలసింది మీరు . నేను ప్రిపేర్ కానంటే మీరెక్కడ
ప్రిపేర్ కానంటారేమోనని, నేనూ ప్రిపేరవుతానన్నానంతే.
రేపటి రోజున నన్ను ఫలానా కలెక్టర్ వసంతరావు గారి భార్య అంటారే గాని , ఎం ఏ  వసుంధర గారు అని  అనరు.
నేను మీ భార్యగా  చలామణి అవ్వాలనుకున్నాను. ఇన్నాళ్టకి నాకెంతో ఆనందంగా ఉంది.
ఈ లోకం నాటిన విషవ్రుక్షం నాలో నానాటికీ వ్రుధ్ధి అవుతూ, నన్ను నరకయాతనకు గురి చేసింది. నేనెలా
సమాధానమివ్వాలా ఈ లోకానికి ,  అని నాలో నేను మధనపడ్తున్న సమయంలో నువ్వు నాకు మంచి సలహా
యిచ్చావు.
నువ్వు ఉన్నత చదువులు చదివినందులకు , సక్రమంగా ఆలోచించి మన సంసారాన్ని బాగుచేశావు . నిజ్జంగా
నీలాంటి  స్త్రీని భర్యగా పొందినందుకు  నేనెంతో గర్విస్తున్నాను.
* స * మా * ప్తం *

 

ప్రేమకు మారుపేరు


       రచన : వెంకట్ హేమాద్రిబొట్ల

                                       
అమ్మ అనే పదానికి నిర్వచనం ఏమిటి? – మీరు ప్రశ్న వేశారు.  దానికి నేను, నాకు తోచిన రీతిలో ఏదో ఒక  సమాధానం చెప్తాను. ఇది ఒక భాషాయుక్తమైన ప్రక్రియ.   కొన్ని పదాలను ఉపయోగించి, వాటిని వాక్యాలుగా కూర్చి సమాధానం చెప్పడం ఈ ప్రక్రియలో భాగం.  కానీ ఆ పదాలు, వాక్యాలు కలిపి చెప్పినది సరిపోతుందా?  అమ్మ గురించి చెప్పాలనుకున్న భావాలు ఈ మాటల సాయంతో ఎవరైనా చెప్పగలరా?  లేరు, చెప్పలేరు.  అది ఏ భాష అయినా కానివ్వండి, సమాధానం చెప్పాలనుకున్నప్పుడు, ఆ భాష సరిపోదు అనిపిస్తుంది.  అందుకు కారణం కొన్ని భావాలను మాటల రూపం లో చెప్పలేక పోవడమే.
పరిమితి  కలిగిన భాష, అపరిమితమైన ప్రేమను వ్యక్తం చేయలేదు కదా!
అయితే, ఎంత చెప్పినా తక్కువే అని తెలిసినా, కవులు రచయితలూ, వారికి సాధ్యమయినంతగా అమ్మ గురించి చెప్తూనే వున్నారు.   దేవుడు సృష్టించిన “మాతృమూర్తి” అనే అధ్బుతమైన వ్యక్తి గురించి ఎంతో కొంత చెప్పాలి అన్న తపనే వారిచేత అలా చేయించింది.
అలాగే, చలన చిత్రాల మాధ్యమంతో కూడా ఈ ప్రయత్నం చేసారు.   ఆ ప్రయత్నం లో భాగంగా వచ్చిన కొన్ని చలన చిత్రాలు ఈ పాత్రను ఎలా మలిచారో చూద్దాం.
ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది “అమ్మ రాజీనామా” చిత్రం గురించి.   కాకపోతే, ఈ కథని ఒక సినిమాకథలా కాక, ఆ మధ్య వచ్చిన “మహాభారత్” టి. వి. సీరియల్ లో ముందుగా వచ్చే “మై సమయ్ హు” లాగా మొదలుపెడదాము.  ఎంత సేపూ టైం సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు అని ప్రతీదానికీ అంటూ ఉంటాం కదా?  ఏవో చేసిన కొద్ది పనులకే “హుష్హు” అంటూ తెగ బిల్డ్ అప్ ఇస్తూ ఉంటాం.  మరి “అమ్మ” అలా ఎప్పుడైనా అనుకుందా?  అనుకుంటే ఒక్క రోజైనా గడుస్తుందా?  ఈ ప్రశ్నలకి జవాబులు వెతికేందుకు ఈ “సమయ్” కథ ఏమిటో చూద్దాం.
ప్రతీ రోజూలాగే ఆ రోజు కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకి ఉదయం అయ్యింది.  సమయం – అవుతున్న ఒక్కో పనిని చూస్తూ ముందుకి వెళుతోంది.  ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న అనుభవం కారణంగా పనులు ఒకటి తరువాత ఒకటి అవుతున్నాయి.  కానీ, ఎక్కడా పెద్ద చప్పుళ్ళు అవీ లేవు.  వీలైనంత నిశ్సబ్దంగా ఆ పనులు చక్క పెట్టబడుతున్నాయి.  నాలుగు నుంచి ఆరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది -  రోజు తరువాత రోజు, సంవత్సరం పై సంవత్సరం.
అవును, అమ్మ దిన చర్య రోజూ ప్రొద్దునే ఇలా ప్రారంభం అవుతుంది.   మిగితావారు లేచేలోపు సగం పనులు అయిపోయేలా, అవ్వాల్సిన మిగతా పనులకి తయారు అయ్యేలా.
సమయానికి ఈ క్రమం అంతా రోజూ చూసి, చూసి అలవాటు అయిపొయింది.  అయితే, ఈ రెండు గంటలు దానికి ఎంతో ఇష్టమైన కాలం.  ఎందుకంటే, ఆరు గంటల నుంచి దానికి వేరే విధమైన పరిస్థితులు ఎదురువుతాయి.  గందరగోళం మొదలవుతుంది.  అందరూ అటు ఇటు పరుగు పెడుతూ వుంటారు.  ఒక్కరు కూడా సమయంతో  సమన్వయం తోటి పనులు చేసుకోరు సరికదా,  పై పెచ్చు ఆ సమయాన్నే అంటూ ఉంటారు -  “ఎలా పరుగెడుతోందో చూడండి”? అంటూ.  “నేను ఓ రెండు గంటల ముందు, ఇప్పుడు ఒకేలా ఉన్నాను కదా”?, నన్నెందుకు అంటున్నారో అర్ధం కాదు అనుకుంటూ ముందుకు కదులుతూ ఉంటుంది అది.  ఒక్కొక్కరికి తెల్లవారుతూ ఉంటుంది … ఆరు గంటలకి కొంతమందికి, ఏడింటికి కొందరికి – ఎనిమిది, తొమ్మిది – ఇలా వారుతూనే ఉంటుంది.
ఒక్కొక్కరూ లేచి, వారి పనులు వారు చేసుకుని, అందుకు తెగ హడావుడి పడిపోయి, చివరికి ఎలా అయితేనేం తయారు అవుతారు.  ఇస్త్రీ బట్టలు రెడీగా ఉన్నాయా?  ఉన్నాయి.  యూనిఫారం రెడీగా ఉందా?  ఉంది? షూస్? రెడీ.  చొక్కా బటన్ లేదు – స్నానం చేసే లోపు కుట్టి ఉంటుంది.  టిఫిన్ రెడీ.  బస్ కి చిల్లర రెడీ.  బైక్ లో పెట్రోల్ కి డబ్బులు రెడీ.  అమ్మా కీస్ ఎక్కడ?  నిన్న టి.వి. చూస్తూ పక్కనే టేబుల్ మీద పెట్టావు.  లంచ్ బాక్స్ – అది కూడా సర్ది టేబుల్ మీదకి వచ్చింది, ఎప్పుడో మరి?  కాఫీ, టీ, పాలు, రెండో సారి కాఫీ? – రెడీ.  నేను కార్న్ ఫ్లేక్స్ తింటాను – ఓ. కే.  నాకు ఓట్స్ కావాలి -  అలాగే.  అబ్బా! ఇవాళ కూడా ఉప్మా యేనా?  దోసెలు కూడా ఉన్నాయి.  మిగిలిన హోం వర్క్?  అయిపొయింది.   పుస్తకానికి అట్ట?  వేసి ఉంది.   ఈ ప్రశ్నలకి సమాధానాలు వినగానే ఒక్క క్షణం “హమ్మయ్య” అనుకున్న వారు – అవి ఎలా అయ్యయో?  అమ్మకి ఇవన్నీ చేయడానికి వీలు ఎప్పుడు చిక్కిందో? అని ఆలోచించే టైం మాత్రం లేదు.  అలా మొదలైన రోజు, ఒక పని తరువాత ఒకటి గా రోజంతా సాగుతూనే ఉంటుంది.  రాత్రి వరకూ.
ప్రతీ రోజూ లాగే ఆ రోజు కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకి ఉదయం అయ్యింది.  సమయం కూడా బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది – అమ్మ లేపుతుంది కదా అన్న ధీమాతో.  కానీ ఆ రోజు అలికిడి ఏదీ లేదు.  ఎందుకో అనుమానం వచ్చి చూసిన ఆ సమయ్ కి అమ్మ కుర్చీ లో కూర్చుని కాఫీ తాగుతూ కనపడింది.  హమ్మయ్య అనుకుంటూ, ఏంటి అమ్మ ఇంకా అలా కూర్చున్నావు, “లే, అందరూ లేచే టైం అయ్యింది, మొదలుపెట్టు” అంటూ సమయం మొదటిసారిగా హడావిడి పడింది. అందుకు అమ్మ చిరునవ్వుతో అంది – లేదు, నేను ఇవాళ ఏమి చెయ్యట్లేదు.  ఆ తరువాత ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.  తన నేస్తమైన సమయానికే కాదు కదా, ఆ పై లేచిన ఆ ఇంట్లో సభ్యులెవ్వరికీ అర్ధం కాలేదు.  ఏమైందో తెలీదు, పనులు ఎలా చేసుకోవాలో తెలీదు.  అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో కూడా తెలీని అయోమయ పరిస్తితి.  అందుకు కారణం ఏమిటో కూడా తెలియని మానసిక స్థితి లో వాళ్ళు ఉన్నారు.  అమ్మ – ఇది అవ్వలేదు ఏమిటి?  అది రెడీ గా లేదు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు తప్ప వేరొక ఊహ వారికి రావట్లేదు.  అప్పుడు చెప్పింది అమ్మ – నేను ఈ పనులేవీ చెయ్యట్లేదు, నేను రాజీనామా చేస్తున్నాను.  వాట్?  అవును, మీరు విన్నది నిజమే – నేను ఈ నాలుగు టు పదకొండు/పన్నెండు, మూడు వందల అరవైఅయిదు రోజుల ఉద్యోగం నుంచి రాజీనామా చేస్తున్నాను.  మీకు ఎన్ని సార్లు చెప్పినా టైం కి లేవడం, తయారు అవ్వడం లేదు కదా, కనీసం చేసిన వాటికి సాంత్వన గా ఒక మాట మాట్లేడేందుకు కూడా వీలు అవ్వట్లేదు.  ఇంక నేను ఎందుకు చేయాలి?  అంటున్న అమ్మ మాటలకి వారు అవాక్కై చూస్తూ ఉండిపోయారు.  మెల్లిగా వారికి జ్ఞానోదయం అవుతుంది.  మేము ఇకపై అలా చేయము అమ్మ, నువ్వు చెప్పి నట్టు వింటాము అనడంతో ఆ తల్లి కరిగిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతుంది.  ఎంతైనా కరుణామూర్తి కదా.  పిల్లలు కూడా అప్పటినుంచి బుద్ధిగా, వారి పనులు సమయానికి చేసుకోవడమే కాకుండా, అమ్మకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు.  ఇదంతా చూస్తున్న మన నేస్తం అయిన సమయం చిరునవ్వు నవ్వుతుంది.  అదీ కథ.

మనం కథలాగా చెప్పుకోడానికి సమయం, అమ్మ నేస్తం, అని ఒక పాత్ర ని ప్రవేశ పెట్టాను.  అది తప్ప, పైన చెప్పిన కథ, సన్నివేశాలు అన్నీ “అమ్మ రాజీనామా” చిత్రం లో ఉన్నాయి.  దాసరి నారాయణ రావుగారి దర్సకత్వంలో ఊర్వశి శారద అధ్బుతంగా నటించిన చిత్రం ఇది.  అమ్మ, ఓర్పు, సహనం గురించి ఎంతో గొప్పగా ఇందులో వర్ణించారు.  “తను చేస్తుంది లే” అన్న అలసత్వం తో ఉన్నవారికి అమ్మ గనక ఒక్క రోజు అలా చెయ్యకపోతే ఎంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
అమ్మ గొప్పతనంలో ఇంకొక కోణం తెలియచేసే చిత్రం “పెళ్లి”.   ఇందులో “సుజాత”, “మహేశ్వరీ” తల్లీకూతుళ్ళు.  ఒక కాలనీలో పోర్షన్ అద్దెకి తీసుకుని ఉంటారు.  పక్క పోర్షన్ లో ఉంటున్న “వడ్డే నవీన్” మహేశ్వరిని ఇష్టపడతాడు.  ఈ లోపు “పృథ్వీ” కారెక్టర్ ఎంటర్ అవుతుంది.  సుజాత తనకి తల్లి అని, మహేశ్వరీ తనకి భార్య అనీ అంటాడు.  అందరూ ఇదేమిటి అనుకుంటుండగా అసలు సంగతి తెలుస్తుంది.  పృథ్వీ నిజంగా మహేశ్వరీ భర్తే అని, అయితే తను చేసే దుర్మార్గాలు, పెళ్ళాన్ని పెట్టే కష్టాలు చూడలేక ఆ తల్లి, కోడలని తీసుకుని వేరే చోటికి వచ్చిందని తెలుస్తుంది.  చివరకి కన్న కొడుకుని కాదని కోడలిని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతుంది. చివరికి ఈ పెళ్లికి అడ్డుపడాలనుకున్న కొడుకు విషమిచ్చి తానూ కూడా విషం తాగుతుంది. ఈ కథలో అమ్మ, కేవలం తన కొడుకు అయినంతచేత వాడు చేసే చెడుపనులకి మద్దతు ఇవ్వదు.  అలాగే కోడలు చేయని తప్పుకి శిక్ష అనుభవించ కూడదని, తన జీవితం చక్క దిద్దాలని అనుకుంటుంది.

“తల్లా పెళ్ళామా”? అసలు ఇలాంటి ప్రశ్నే రాకూడదు.  ఎవరికి సముచితమయిన స్థానం వారికుంది.  అది అలా ఉంచితే, NTR స్వీయ నిర్మాణం లో శాంతా కుమారి, చంద్రకళ తో పాటు నటించిన చిత్రం పేరు కూడా ఇదే.  సరిగ్గా టైటిల్ కి తగ్గ కధాంశం ఈ చిత్రం లో ఉంటుంది.  కుటుంబాలలో వచ్చే మనస్పర్ధలు, అటు తల్లీ, ఇటు పెళ్ళాం, వారిలో ఎవరి వైపు మొగ్గు చూపాలి అన్నది కథ.   వేరు వెళ్ళిపోదాం అన్న చంద్రకళ తో అలాగే అని, ఆ తరువాత వాళ్ళకి పుట్టిన బిడ్డని తీసుకుని వచ్చేస్తాడు NTR.   ఇదేంటి, ఇలా చేశారు? అని అడిగితే, ఆ రోజు నువ్వు చేసింది కూడా ఇదే కదా అంటాడు.  తన తప్పు తెలుసుకుంటుంది చంద్రకళ.  అందరూ కలవడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఇదే అంశం “బొట్టూ కాటుక” చిత్రంలో కూడా ఉంది.  శ్రీధర్ కి తల్లిగా నిర్మలమ్మ, భార్యగా జయంతి నటించారు.  వాళ్ళ పిల్లలు ఒకరోజు “మాక్ కోర్ట్” “ఉత్తుత్తి కోర్ట్” నిర్వహించి తల్లి గొప్పా, భార్య గొప్పా అని అడుగుతారు.  అందుకు తల్లే గొప్ప అని తీర్పు వస్తుంది.   అందుకు అలుగుతుంది జయంతి.  ఆ మరునాడు జయంతి పుట్టినరోజు అవుతుంది.  ఏమి ఎరుగనట్టు ఉన్నవారు అందరూ నిజానికి ఒక గది అంతా డేకోరేట్ చేసి సర్ప్రైజ్ పార్టీ ఇస్తారు.  ఒక్కసారి గా ఎంతో రిలీఫ్ ఫీల్ అయిన తనతో అంటాడు శ్రీధర్ – నిన్న చెప్పింది “అమ్మ” గొప్పది అని.  నాకు తను అమ్మ ఎలాగో నువ్వు పిల్లలకి అలాగే కదా.  అది అందులోని గొప్పతనం అని.  ఇలాంటి హృద్యమైన సన్నివేశాలు మనకి పాత చిత్రాలలో కనపడుతాయి.

అలాగే, హీరోయిన్ తో ఇటువంటి ప్రశ్నే వేయిస్తారు దర్శకుడు ఎస్. వి. కృష్ణా రెడ్డి గారు  “యమలీల” చిత్రంలో.  అందులో ఇంద్రజ – “నీకు నేను కావాలా?, నీ తల్లి కావాలో? తేల్చుకో”  అంటుంది ఆలీ తో.  అందుకు అతను – నన్ను కని, పెంచి, పెద్ద చేసిన తల్లే నాకు ముఖ్యం అని బదులిస్తాడు.  ఆ జవాబులో ఉన్న గొప్పతనం అర్ధం చేసుకున్న ఇంద్రజ కూడా తన తప్పు తెలుసుకుని మారుతుంది.
ఇక అవసరం అయితే, అన్యాయం ఎదిరించే తల్లులను, వారి బిడ్డలను అభినవ శివాజీలుగా తయారు చేసే జిజియాబాయిలను మనం “నిజం” (తల్లిగా తాళ్లూరి రామేశ్వరి, తనయుడిగా మహేష్ బాబు), “ఛత్రపతి” (తల్లి భానుప్రియ, కొడుకుగా ప్రభాస్) చిత్రాలలో చూస్తాం.  వారి పిల్లలకి ధైర్యం నూరి పోసి వారిని అన్యాయాన్ని ఎదిరించే యోధులుగా, నలుగురికి మంచిచేసే వారిగా తీర్చి దిద్దు తారు ఇందులో.
మగాళ్ళు అందరూ మోసం చేసేవాళ్ళే, అందుకే అసలు పెళ్ళే చేసుకోకూడదు అంటూ కూతురికి (ప్రియమణి)  చెప్పే తల్లి పాత్ర లో “రోజా” కనిపిస్తుంది “గోలీమార్” చిత్రం లో.  అందరూ అలా కాదు, “గోపీచంద్” లాంటి  మంచి వాళ్ళు కూడా ఉంటారు అని హీరో పాత్ర ద్వారా తెలిసిన తరువాత, ఆ దృక్పధం మార్చుకుని వారికి అండగా నిలుస్తుంది.
ఇటీవల కాలంలో తల్లీకొడుకుల బంధాన్ని ఒక అందమైన స్నేహంగా కూడా చిత్రీకరించారు.  “ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్”  మూడింటిలో చివరి రెండూ విషయాలలో, అంటే మంచి నడవడిక నేర్పి, మార్గదర్శి గా ఎప్పుడూ ఉండే అమ్మ, మంచి స్నేహితురాలిగా కూడా కనపడుతుంది ఈ చిత్రాలలో.
“అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి” చిత్రం లో “రవితేజ” కి ఎప్పుడూ అండగా ఉండడమే కాకుండా తనతో మంచి స్నేహితురాలిగా మెలిగి, సపోర్ట్ చేసే తల్లి గా “జయసుధ” కనిపిస్తారు.  ఈ చిత్రంలో వీరిపై “నీవే నీవే నేనంట, నీవే లేక నీనే లేనంట” అన్న ఒక హృద్యమైన పాటను కూడా చిత్రీకరించారు దర్శకులు పూరి జగన్నాథ్.

అలాగే, ఈ మధ్య రిలీజ్ అయిన “అలా మొదలైంది” చిత్రం లో “నాని” కి ఫ్రెండ్ గా ఉంటూ, ప్రేమ విఫలం అయ్యి బాధలో ఉన్నపుడు ధైర్యం చెప్పి,  మళ్ళీ మామూలు మనిషిని చేసే స్నేహితురాలిగా “రోహిణి” పాత్రను చక్కగా మలిచారు దర్శకురాలు నందిని రెడ్డి.
మేరె పాస్ బంగ్లా హై, గాడి హై, పైసే హై, తుమ్హారే పాస్ క్యా హైన్? అంటాడు “అమితాబ్” “దీవార్” చిత్రంలో “శషి కపూర్” తో.  (నా దగ్గర పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది?).
అందుకు ఒకే ఒక సమాధానం సమాధానం – “మేరే పాస్ మా హైన్”.  నా దగ్గర తల్లి ఉంది.  తల్లి ఉంటే అన్ని ఉన్నట్లే, లేదంటే అన్నీ ఉన్నా నిరుపేదే అన్న నిజం ఒక్క ముక్కలో చెపుతారు ఇందులో.  అది ఎంతైనా నిజం కదా.
“అమ్మను మించి దైవమున్నదా?, ఆత్మను మించి అద్దమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే” అని “20 వ శతాబ్దం” చిత్రంలో ఒక అద్బుతమైన పాట రాసారు “సినారె”.  ఇది ఎంతైనా నిజం.
కొన్ని వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అమ్మ గురించి అయితే చాలా చాలా తక్కువ.  చివరగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు అమ్మ గురించి తరచూ చెప్పే ఒక మాట చెప్పి ముగిస్తాను.
ఒకడు వేశ్య ఇంటికి వెళ్ళి తలుపు తడుతాడు.  నీ తల్లి యొక్క గుండె తీసుకుని వస్తేనే తలుపు తీస్తాను అంటుంది ఆ వేశ్య అతనితో.  వాడు కామంతో కళ్ళు మూసుకు పోయిన వాడై పరుగు పరుగున వెళ్ళి ఆ తల్లిని గుండెకాయ అడుగుతాడు.  ఆవిడ అలాగే తీసి ఇస్తుంది.  అదే పరుగున వాడు అది చేత పట్టుకుని వెళ్ళబోతూ, గడపకి కాలు తగిలి కింద పడుతాడు.  అప్పుడు వాడి చేతిలో ఉన్న గుండె అంటుంది – “అయ్యో! దెబ్బ తగిలిందా నాయనా?, చూసుకుని వెళ్ళరా” అని.  అది తల్లి అంటే.
అటువంటి తల్లిపై, మన చలన చిత్రాలలో ఉన్న కొన్ని పాత్రల గురించి, సన్నివేశాల గురించి నాలుగు మాటలు చెప్పే అదృష్టం నాకు కలిగింది.  మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.

 

తెలుగు సినిమాల్లో జానపద కధలు

రచన: వెంకట్ హేమాద్రిబొట్ల  

అదంతా ఒక ఎడారి లాంటి ప్రాంతం.  ఎక్కడా జనసంచారం కానీ, ఇతర ఏ విధమైన కదలికలు కానీ లేవు.  గాలి కూడా ఎవరో చేత్తో పట్టి ఆపినట్టు స్తంబించి ఉంది.  అంత నిర్మానుష్యమైన ప్రదేశం లో శిధిలావస్త లో ఉన్న ఒక కట్టడం మాత్రం ఉంది.  అందులోంచి పెద్దగా మంత్రాలు వినపడుతున్నాయి.  ఇంతలో, టక్ టక్ … టక్ టక్ మని దూరం నుంచి గుర్రం డెక్కల చప్పుడు లీలగా వినపడుతోంది.   క్రమంగా ఆ గుర్రం ఇటే దూసుకుని వస్తునట్టుగా ఆ శబ్దం పెద్దదవుతూ వచ్చింది.   అంతలో ఆ గుర్రం పై వేగంగా స్వారి చేస్తూ వస్తున్న రాజకుమారుడు కనబడ్డాడు.   అలా వస్తున్న రాజ కుమారుడిని చూసి, రెండు చేతులు చెరో వైపు కట్టేసి ఉన్న రాకుమారి కళ్ళు ఆనందంతో వెలిగాయి.  ఇది చూసి బిగ్గరగా మంత్రాలు చదువుతున్న బారెడు గడ్డం ఉన్న మాంత్రికుడు స్వరం ఇంకా పెంచి చేతిలో గుప్పెడు భస్మం తీసుకుని ఎదురుగా ఉన్న మంటలో వేసాడు.  అందులోంచి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చి రాకుమారుడిని అడ్డగించాడు.  వాడితో హోరాహరి గా తలపడి, చివరికి గాలిలో ఆరు అడుగులు పైకెగిరి తన చేతిలో ఉన్న కత్తితో వాడిని హతమారుస్తాడు ఆ రాకుమారుడు.  అదే ఊపులో లో వెళ్ళి ఆ మాంత్రికుడి తల తెగనరుకుతాడు.  అది వెళ్ళి అగ్ని గుండం లో పడుతుంది.  అంతే, రాకుమారి చేతులకి కట్టి ఉన్న తాళ్ళు మాయమవుతాయి.  అప్పుడు ఎదురుగా ఉన్న పెద్ద కాళికామాత ప్రసన్నురాలై వారిద్దరిని దీవించి అంతర్ధానమవుతుంది.   రాజకుమారుడు రాకుమారిని అమాంతం గాలిలోకెత్తి గుర్రం పై ఎక్కించుకుని రాజ్యం వైపు దూసుకుపోతాడు. 
అప్పటి వరకు కథలో లీనమై, వేరే లోకంలో విహరిస్తూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఈ లోకంలోకి వస్తారు.  వారిలో ఒక విధమైన సంతోషం కనపడుతుంది.  చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే ఒక కథని చూసిన సంతోషం అది.   ఇదంతా నిజం కాదు, కేవలం కథే అని తెలిసినా, కాసేపు ఆలోచన అంతా పక్కన పెట్టి (suspension of belief), తెరపై జరుగుతున్న సన్నివేశాలలో లీనమైపోవడం వల్ల వచ్చిన అనుభూతి అది.   ఎందుకంటే, అలా చేయడం వాస్తవాన్ని, అందులోని బాధల్ని కాసేపు మరిచిపోయేలా చేస్తుంది కాబట్టి.  రాజులు, రాణులు, మాంత్రికులు, మంత్ర దండాలు, మాయలు, గుర్రపు స్వారీలు, కత్తి యుద్దాలు – ఒక వేరే లోకంలో విహరించి వచ్చినట్టుగా ఉంటుంది.  అందుకే అందరికి ఎంతో నచ్చుతుంది, ఆనందాన్నిస్తుంది.   ఇలాటి సినిమాలు చిన్నపిల్లలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. పెద్దవాళ్లు కూడా ఇటువంటి సినిమాలను పూర్తిగా లీనమై చూస్తారు. ఆ కొద్ది గంటలుపాటు మరో లోకానికి వెళ్లిపోతారు
అవును, తెలిసిందేగా.  అందుకేగా పిల్లలని తీసుకుని వెళ్ళి హ్యారీ పోటర్, నార్నియా, లయన్ కింగ్ వంటి సినిమాలు చూసేది.   వాటి గురించే కదా మీరు మాట్లాడేది? 
కాదు, కాదు, కాదు.  ఈ రోజుల్లో, ఇంతటి సాంకేతికత అందుబాటులో ఉండి, వాటిని ఉపయోగించి తీస్తున్న సినిమాలు గురించి కాదు నేను చెప్పేది. 
అవునా, మరి వేటి గురించి?  - వేటి గురించి అంటే, ఈ టెక్నాలజీ, ఫొటోగ్రఫి, కంప్యుటర్ యానిమేషన్ వంటివి అభివృద్ధి చెందని కాలంలోనే అద్బుతమైన చిత్రాలు తీసి ప్రేక్షకులని కుర్చీలకి (లేదా బెంచీలకి ఇంకా మాట్టాడితే నేలకి) కట్టిపడేసి, వారిని కల్పనా జగత్తి లో విహరింపచేసిన చిత్రాలు గురించి.  జానపద చిత్రాల గురించి. 
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి.  పౌరాణికాలు, సాంఘిక చిత్రాలు.  అలాగే జానపద చిత్రాలు.  మిగితా వాటిలాగే, ఇవి కూడా ఎంతో జనాదరణ పొందాయి.    
పాతాళ  భైరవి,మల్లీశ్వరి,  జయసింహ, గులేబకావళికథపిడుగురాముడుగోపాలుడుభూపాలుడుకంచుకోటరాజమకుటంగుణసుందరి కథచండీ రాణీ, బాల రాజు, కీలుగుర్రం, జగదేక వీరుని కథ,  – ఎన్నో, ఎన్నెన్నో  చిత్రాలు.  ఇవన్నీ ఆ కాలం లో ఎంతో పాపులర్ అయ్యాయి.  జానపద బ్రహ్మ గా పేరుగాంచిన విఠలాచార్య గారు తీసిన – ఆలీబాబా 40 దొంగలు, భలే మొనగాడు, అగ్గి బరాటా, చిక్కడు దొరకడు, బందిపోటు – ఇలా ఎన్నో చిత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి.  ఎన్.టి. రామరావు గారికి, కాంతారావు గారికి ఎంతో పాపులారిటీ తెచ్చి పెట్టాయి.  ఎంతో మంది విలక్షణమైన నటులు ఈ చిత్రాలలో నటించి అలరించారు.  ఆ చిత్రాలు వారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయి.  అలాంటి చిత్రాల గురించి, వాటిలో కొన్ని చిత్రాల కథాంశాల గురించి ఇవాళ చూద్దాం.  

ముందుగా, జానపద చిత్రం అనగానే అందరికీ గుర్తొచ్చే చిత్రం పాతాళ భైరవి.   ఒక సామాన్యుడుతోటమాలి గా పనిచేసుకునేవాడురాకుమారిని చూసి అర్జంట్ గా ప్రేమించిఆ ప్రేమ కోసం ఎన్ని పాట్లు పడ్డాడుఎన్ని సాహాసాలకి ఒడిగడతాడు అన్నది ఈ చిత్రం కథాంశం.  ఆ తరువాత ఇలాంటి కథతో ఎన్ని చిత్రాలు వచ్చాయో లెక్క లేదు.  పేద హీరో డబ్బున్న అమ్మాయిని ప్రేమించడంఆ క్రమం లో కష్టాలు ఎదురుకోవడంవిలన్స్ తో ఫైట్ చేయడంచివరికి గెలుపొందడం ఇలాంటి కథాంశంతో తరువాత అసంఖ్యాకమైన చిత్రాలు వచ్చాయి.  పాతాళ భైరవి చిత్రంలో ఒక కథకి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి.   ఇందులో ప్రేమ కోసం పడ్డ తపన ఉందిసాహస కృత్యాలు ఉన్నాయిమంచి హాస్యం ఉందిచివరికి సమయ స్ఫూర్తి తో వ్యవహిరించడం ఎలా అని కూడా చూపించారు.  ఎన్టీఅర్ఎస్.విరంగా రావు పోటీ పడి నటించిన ఈ చిత్రం విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా దాని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదుఈ రోజుకీ సాహసం సేయరా డింభకా అంటూ ఏదైనా పని చేయమని ప్రోత్సాహించడంవాడా?  వాడుప్రేమ కోసమై వలలో పడ్డాడు అంటూ జాలి పడడంఎవరినైనానీకు ఏదైనా కావాలాఅని అడగాలంటేసింపుల్ గా కాక, “నరుడా ఏమి నీ కోరిక“ అంటూ అడగడం ఈ చిత్రంఅందులోని మాటలు ఎంత ప్రజాదరణ పొందాయి అనడానికి తార్కాణాలు.  
మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో రాజు తమ్ముడు కానీ లేక మంత్రి, సేనాధిపతి ఎవరో రాజుని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నడం, రాకుమారుడు రహస్యం గా పెరగడం, పెద్దైన తరువాత వారి ఆటలు కట్టించి తిరిగి రాజ్యం దక్కించుకోవడం, ఈ కథాంశం తో వచ్చేవి చిత్రాలు.  ఆ క్రమం లో కథ ఎన్నో మలుపులు తిరగడం, మధ్యలో హాస్యం పండిచడం, గుర్రాల పై చేజ్ చేయడం, కత్తి యుద్ధాలు – ఇలా అన్ని కలిసి ఉన్న జనరంజకమైన చిత్రాలు వచ్చాయి.  

జయసింహ చిత్రంలో జయసింహుడు (రామారావు) యువరాజు.  మహారాజు మరణించగా అతని తమ్ముడు రుద్రసింహుడు (ఎస్.వి. రంగారావు) రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు.  జయసింహుడుని అంతం చేసి పూర్తిగా రాజ్యం తన వశం చేసుకుందామని కుట్ర పన్నుతాడు.  అది తెలుసుకున్న జయసింహుడు రహస్యం గా పొరుగు రాజ్యం వెళ్లిపోతాడు. అక్కడి రాజుని శత్రువుల నుంచి కాపాడుతాడు.  ఆ దేశపు రాకుమారి తో ప్రేమలో పడుతాడు.  ఆ రాజ్యపు దుష్ట సేనాధిపతి (రాజనాల) ఆట కట్టిస్తాడు.  అక్కడ నుంచి తన రాజ్యానికి వచ్చి  రుద్రసింహుడిని ఎదురుకుంటాడు.   ఆ ప్రయత్నం లో రుద్రసింహుడి కుమారుడు విజయసింహుడు (కాంతా రావు) జయసింహుడు కి అండగా నిలుస్తాడు.  రాజద్రోహం తలపెట్టిన రుద్రసింహుడు చివరికి తన కొడుకు చేతిలోనే మరణిస్తాడు.  జయసింహుడు రాజ్యాన్ని తిరిగి చేజ్జిన్కుంచు కుంటాడు.   అలాగే, రాజమకుటం చిత్రంలో కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. కానీ ఆ హత్యా నేరం వేరే వారి మీద మోపి వారికి మరణ శిక్ష పడేలా చేస్తాడు.  అలా మరణ శిక్ష పడిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు.  ఇదంతా తెలుసుకున్న యువరాజు, తన తల్లి తో కలిసి తెలివిగా దుర్మార్గుడైన మంత్రి ఆట ఎలా కట్టిస్తాడు అనేది చూసి తీరాల్సిందే.  కథ ఆద్యంతం మలుపులతోఆసక్తికరం గా సాగుతుంది.  ఇక్కడ ధైర్య సాహసాలే కాకతెలివి తేటలు కూడా ఎంత అవసరమోచాక చక్యం గా వ్యవహిరించడం కూడా ఎంత ముఖ్యమో చూపించే పలు సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.  చివరికికేవలం కత్తి యుద్ధాలే కాకుండాఒక మంచి కథ చూసిన అనుభూతి ప్రేక్షకులకి కలుగుతుంది. 
ఈ కాలంలో వచ్చిన ఇంకొక అద్భుతమైన చిత్రం మల్లీశ్వరి.     రాయల పాలన కాలం నేపధ్యం లో జరిగే కథ ఇది.  ఈ చిత్రంలో ఎన్.టి.అర్ నాగరాజు గా శిల్పి పాత్ర లో భానుమతి మల్లి గా గాయని గాబావా మరదళ్ళు గా నటించారు.  ఒకానొక సందర్భం లో,  శ్రీకృష్ణ రాయలుకి, ఆయన ఆస్థానకవి అల్లసాని పెద్దన్నకి నాగరాజు, మల్లి  ఆతిధ్యం ఇచ్చి మర్యాద చేయడంతో అనుకోకుండా భానుమతి కి రాణివాసం (మహారాణి అంతఃపురంలో లో ఉండే అవకాశం ) దక్కుతుంది.  వారు ఇచ్చే బహుమానాలకి, కానుకలకి ఆశపడి ఋష్యేంద్రమణి (భానుమతి తల్లి పాత్రలో), ప్రేమించుకున్న బావ మరదళ్ల ని విడదీసి, మల్లి ని అంతఃపురానికి పంపుతుంది.  మల్లి అంతఃపురంలో ఉన్నా, మహారాణి ఇష్ట సఖిగా మారినా, నాగరాజు లేకపోవడంతో దిగాలుగా ఉంటుంది.  అటు నాగరాజు కూడా మల్లి కోసం బాధ పడుతూతను చెక్కే ప్రతీ శిల్పం లో మల్లినే చూసుకుంటూ ఉంటాడు.   ఇదంతా తెలుసుకున్న రాజుఒక సారి రాణివాసం లో చేరిన స్త్రీలు మగవారిని చూడకూడదుబయటకి వెళ్ళ కూడదు అన్న నియమం ఉన్నాఅవన్నీ పక్కన పెట్టి పెద్ద మనసు తో వారిద్దరినీ ఒకటి చేస్తాడు.  ప్రేమ – ఐశ్వర్యం మధ్య,  అమాయకత్వం - అత్యాశ మధ్య సాగే ఘర్షణ ఎంతో అందంగా చిత్రీకరించిన ఈ చిత్రం లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాలని హత్తుకుంటుంది. 
ఇక భానుమతి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం చండీరాణి.  ఒక పాత్ర అమాయకంగా ఉండడంమరొక పాత్ర ధైర్య సాహసాలతో కూడి ఉండడం ఈ చిత్రం కథాంశం.  రెండు పాత్రల లోనూ భానుమతి అవలీలగా నటించారు.  ఈ చిత్రం కూడా ఎంతో ప్రజాదరణ పొందింది.  ఈ కథాంశం తో వచ్చిన హేమ మాలిని నటించిన ”సీతా ఆర్ గీతాఅలాగే జమున గంగ మంగమొన్న మొన్నటి శ్రీదేవి చాల్బాజ్“ చిత్రాలు ఎంత ప్రజాదరణ పొందాయో మీకు తెలిసిందే కదా.  ఇదే కథాంశంగా మళ్ళీ ఒక కొత్త హీరోయిన్ తో ఇంకొక చిత్రం వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.  
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్రాలు, వాటిలో ఎన్నెన్నో మలుపులు తిరిగే కథలు.  ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది.  ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టమైన విషయం కూడానూ.  అది, ఈ చిత్రాలలో ఉన్న పాటల గురించి.  అద్భుతమైన పాటలు.  సూపర్ హిట్స్.  ఎంతో హాయి గొలిపే పాటలు.  ఆ తరానికి, మన తరానికి, తరతరాలని అలరించే పాటలు.  వాటిలో కొన్ని:
సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే (రాజమకుటం) 
ఊరేది పేరేది ఓ చందమామా (రాజమకుటం)
ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు (రాజమకుటం)
మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే (మల్లీశ్వరి)
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు (మల్లీశ్వరి)
ఎంత హాయి ఈ రేయి నిండెనోఎన్నినాళ్ళకీ బతుకు పండెనో (మల్లీశ్వరి)
ఈనాటి ఈ హాయీ…కలకాదోయి నిజమోయీ (జయసింహ) 
ఊహలు గుస గుస లాడే (బందిపోటు)
వగల రాణి వి నీవే, సొగసుగాడను నేనే (బందిపోటు) 
ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది (అగ్గి పిడుగు) 
శివశశంకరి (జగదేకవీరుని కథ)
 జలకాలాటలలో  (జగదేకవీరుని కథ) 
ఇంకా ఎన్నో, ఎన్నెన్నో పాటలు.

ఈ పాటలకి, చిత్రాలకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అనేందుకు 1994 లో బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవ ద్వీపం చిత్రమే నిదర్శనం.  రొటీన్ కథలతో, హెచ్చు మీరిన వయోలెన్స్ వల్గారిటీ తో విసిగిపోయిన ప్రేక్షకులు, ఇలాంటి చిత్రాలు మళ్ళీ వస్తే ఆదారిస్తారు అనడం లో సందేహం లేదు.  ఎందుకంటే, ఇలాంటి కథలు చెప్తూ, చక్కటి హాస్యం పండిస్తూ, శ్రావ్యమైన పాటలు వినిపిస్తూ, వేరే ప్రపంచం లోకి విహరింపచేస్తే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి?

 

పాటే (మాటే) మంత్రము

రచన: వెంకట్ హేమాద్రిబొట్ల

ఇంద్రధనస్సు లో ఏడు రంగులు ఉంటాయి.  కలైడోస్కోప్ లో ఎన్నో రంగులు మారుతూ ఉంటాయి.  చిన్నప్పుడు బయోస్కోపు అనే ఈ బండి అద్దం ముందు, ఒక చేయి కంటి దగ్గిర గొట్టంలా పెట్టుకుని చూస్తుంటే, ఆ బండి అతను హాండిల్ తిప్పుతూ ఉంటే, ఒకట తరువాత ఒకటి  చిత్రాలు వచ్చేవి.  అవి ఎన్నో రంగులు మారుతూ,  దగ్గిరగా దూరంగా, పెద్దగా చిన్నగా వివిధ ఆకారాలుగా మారుతూ ఉండేవి.  అలా చూస్తూ అబ్బురపడేలోపు ఆ చిత్రం అయిపోయేది.  “మళ్ళీ చూపించు” అంటే “మళ్ళీ డబ్బులు” అనేవాడు అతను.

అందరూ అలా ఆసక్తిగా చూసే ఆ యంత్రంలో ఎలా అయితే రంగులు మారుతాయో, అదే విధంగా, ప్రతీ ఒక్కరి పయనంలో కూడా అలా అనుభవాలు మారుతూ ఉంటాయి అన్న మాట.
“ఆహ, అలాగా”? – అవును అలాగే.
ఈ విషయంలో నేను చాలా చాలా పరిశోధనలు చేసాను.  ఇప్పుడు అవన్నీ చెపితే మీరు చదవరు కానీ, దాదాపు అందరి జీవితంలో జరిగే సంఘటనలను, అనుభవాలని రంగరించి, వాటిని అధ్బుతమైన గేయాలుగా మలిచి, ఎంతో మంది కవులు తెలుగు చలన చిత్రాలలో అందించిన పాటల గురించి ఇవాళ తెలుసుకుందాం.  ఈ గేయాలకు తమదైన శైలి లో బాణీలు సమకూర్చి జనరంజకంగా అందచేసారు సంగీత దర్శకులు.  వెరసి, అవి అందరినీ అలరించే ఆణిముత్యాలుగా వెలుగొందాయి.
ఈ గేయాలు ఎన్నో గాయాలు మానేందుకు దోహద పడ్డాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రతీ ఒక్కరూ వారి ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు ఒడిదుడుకులు ఎదురుకునే ఉంటారు.  అలా జరిగినప్పుడు, కొంత మంది పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ, క్రుంగి పోతూ ఉంటారు.  అలాంటప్పుడు వారికి కావలసినది అండగా నిలిచేవారు, వారు చెప్పే ఒక మంచి మాట.  సరిగ్గా, అటువంటి అండగా నిలుస్తూ, ధైర్యాన్ని నూరిపోసి, ఉత్తేజపరిచే పదాలను రంగరించి, వాటిని ఉల్లాసమైన రీతిలో అందించే అద్బుతమైన ఔషదం పేరే “పాట”.
ఆత్మన్యూన్యత, అలసట, వేదన, ఆవేదన, దుఖం అనేవి పటాపంచలం అయిపోయేలా ఈ పాటలు వినేవారిలో ఉత్సాహం నింపుతాయి.  నిరాశగా కూర్చున్న వారిని తట్టి లేపుతాయి, ముందుకు నడవమని ప్రభోదిస్తాయి, అందుకు కావలసిన శక్తిని కలిగిస్తాయి.
అవునండి – పాట – కేవలం వినిపించేది, మురిపించేదే కాదు, ముందుకు నడిపించేది కూడా.  ఈ రోజు అలాంటి పాటలలో కొన్నింటిని చూద్దాం,
నిరాశ నిస్పృహల తో కొట్టు మిట్టాడుతున్న వారికి  మొట్ట మొదట నీవు తెలుసుకోవాల్సిన విషయం “కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు” అని ఒక  పాట చెప్తుంది.  చీకటి అలుముకున్నదని బాధ పడుతూ, కలతలకే లొంగిపోయి కలవరిస్తూ కూర్చునే కంటే – సాహసమనే జ్యోతిని చేకొని సాగు అని చెప్పే అధ్భుతమైన పాట ఇది.   అలా చేసిననాడు, ఆ చీకటి ఉండదు, కలతలు ఉండవు.  అగాధమైన జలనిధి లో ఆణిముత్యము ఎలా అయితే దాగి ఉంటుందో, సుఖం అనేది కూడా శోకాల మరుగున దాగి ఉంటుంది.  అయితే, ఏది నీకు “ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను” అంటూ రాదు, దానిని శోధించి సాధించాలి, అదే ధీరుని యొక్క గుణం అని చెప్పే పాటతో ఈ వ్యాసం మొదలు పెడదాం.
అలాగే, ఇంకొక అధ్భుతమైన పాట – “ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం”.  వింటూనే నర నరాలలో ఉత్తేజం నింపే పాట.  నిరాశను పూర్తిగా పారద్రోలే పాట.  “గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు”.   నీ గమ్యం చేరే దాకా ఎక్కడా అగొద్దు, అసలు అలుపు అనే మాట రావొద్దు అని భుజం తట్టి ముందు నడిపే పాట.  కష్టాలు కన్నీళ్లు రానీ ఏమైనా కానీ, ఎదురు ఏదైనా రానీ, ఒడి పోవొద్దు, ఎట్టి పరీస్తితులలో రాజి పడొద్దు, నీ గమ్యం చేరేవరకు నిదుర పోవొద్దు, ఆ నింగే నీ హద్దుగా సాగు అని దిశా నిర్దేశం చేస్తుంది ఈ పాట.  అలా సాగిన నాడు ఆ వచ్చే “విజయాన్ని నీ పిడికిలి లో చూడాలి, ఆ గెలుపు చప్పట్లు గుండెల్లో మ్రోగాలి” అంటూ నుదుటిపై సంతకం చేసి, యెదలో చిరునవ్వు చిరునామాగా నిండి, వీడని నీడలా నీ వెంటే ఉంటా నేస్తం, పద ముందుకు అని ప్రోత్సహించే ఆ పాట నిజం గా అద్భుతం.  “నమ్మకమే మనకున్న బలం”, ఆ బలం తో “నీలి కళ్ళల్లో మెరుపు మేరవాలి, కారు చీకటిలో దారి వెతకాలి, గాలి వానలో ఉరుమి సాగాలి” అని చెప్పే ఈ పాట, ఈ గమనం లో తగిలే గాయాలలో నీ ధ్యేయం పొందు అంటుంది.  ఈ పాట ఒక్కటి ఉంటే చాలు, దానినే నేస్తం గా చేసుకుని, ఆ పలుకులే మననం చేసుకుంటూ, నిరాశా నిసృహలలో నుండి బయటపడి, తమ గమనం వైపు ఎంతో మంది దూసుకెళ్లారు అనేది నిజం.

ఎక్ల చొలో… ఎక్ల చొలో… ఎక్ల చొలోరే!  అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్.  నీవు సరియైనదని నమ్మి, సాగిస్తున్న బాటలో ముందుగా ఎవరూ నీతో కలిసి నడవక పోవచ్చు.  అంతే కాక, నిన్ను ఎన్నో సూటి పోటీ మాటలతో నిరుత్సాహ పరచడానికి కూడా ప్రయత్నిస్తారు కొందరు.  అయితే, ఇవేవి లెక్క చేయక పట్టుదలతో ముందుకు సాగిననాడు క్రమంగా ఎంతో మంది నీతో కలిసి వస్తారు.  అంతకు ముందు విమర్శించిన వారు, అదే నోటితో నీకు జేజేలు పలుకుతారు.  ఇదే అర్ధం స్పురించే పాట, “ఎవరేమ్మనను, తోడురాకున్ననూ పోరా బాబు పో, నీ దారి నీదే, సాగి పోరా నీ గమ్యం చేరుకోరా” అని.  “నీకు వంద మంది కనపడుతూ వుండొచ్చు, నాకు మాత్రం ఒక్కరే కనపడుతున్నారు, యుద్ధం అంటూ స్టార్ట్ చేసాక నీకు కనపడాల్సింది టార్గెట్ మాత్రమే”  అని ఒక హీరో ఈ మధ్య అన్నట్టుగా, సూటిగా నీ గమ్యం వైపు సాగిపో అని చెప్పే పాట ఇది.   అలాగే  “బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య” అని ఒక చెల్లి అడిగినప్పుడు “సూటిగా చుక్కాని పట్టి నావ నడపవే చెల్లెలా” అని సమాధానం చెప్పాడు ఆ అన్నయ్య.   ఎపుడైనా ఒంటరిగా ఫీల్ అవుతుంటే “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం సూన్యం నాదే” పాట గుర్తు తెచ్చుకుంటే ఎక్కడి ఒంటరితనం అక్కడ ఎగిరిపోతుంది.  ఈ మహా విశ్వం లో మనం కూడా భాగము అన్న భావన కలుగుతుంది.
“మౌనం గానే ఎదగమని మొగ్గ నీకు చెపుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది” – ఇంక ఇంత కంటే క్లియర్ గా ఏమి చెప్పనక్కరలేదు అనుకుంటాను?  “చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో” అంటూ పట్టుదలతో శ్రమిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పిన పాట ఇది.  మొదట్లో ఆ బ్రహ్మ అందరి రాతలు సరిగ్గా రాసేవాడు.  తరువాత తరువాత జనాభా ఎక్కువైపోయి, ఆయనకీ టైం దొరక్క, ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు రాసి బూమ్మీదకి పంపేయడం మొదలు పెట్టాడు.  అందుకు చక్కటి సూచన ఉంది ఈ పాటలో.  “తోచినట్టుగా అందరి  రాతలు బ్రహ్మే రాసాడు, నీకు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి” అని.
“మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ” అని “కృషి ఉంటే మనుషులు ఋషులుతారు, మహా పురుషులౌతారు” అని ఎలుగెత్తి చాటిన గీతం ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు.
ఇందాక “మౌనం గురించి మాట్టడుకున్నాం” కదా – అదే విషయం చెప్పిన ఒక అధ్భుతమైన వాక్యం “గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు” అన్నపాటలో ఉంది.  ఆ వాక్యమే – “కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు, మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు, దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు”.  అనవసరంగా మాట్లాడడం, గట్టి గట్టిగా అరిచి ఆయాసం తెచ్చుకోవడం, తద్వారా ఎన్నో జబ్బులను “కొని” తెచ్చుకోవడం – ఇవన్నీ అవసరమా?  అందుకే అంటాను నేను – “పేషన్స్ ఉన్నవాడు పేషెంట్ కాడు” అని.  ప్రతీ దానికి ఓ తెగ ఫీల్ అయిపోయి బి.పి. తెచ్చేసుకునే బదులు ఓర్పు, సహనం అలవరచు కోవాలి అని ఎంత చక్కగా చెప్పారు ఈ పాటలో.   అలాగే, ఈ పాటలో ఇంకో వాక్యం లో,  ప్రపంచం లో అదరూ మోసం చేసే వారే అని మీకనిపించినప్పుడు, నిజమే, అయితే,  అ సంగతి పక్కన పెట్టి, ఎక్కడైనా చిన్న పాజిటివ్ ఉంటే అది చూడు అని చెప్తుంది – “జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు”.   నిజంగా అమూల్యమైన మాట కదా!
“ఏ సిరులేందుకు, ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే” – ఈ వాక్యం ఒక్కటి చాలు, ఇంక ఈ వ్యాసం ఆపెయొచ్చు.  “జానకి సహనము రాముని సుగుణము ఇలలో ఆదర్శము” అని చాటి చెప్పే ఈ పాట “చీకటి ముసిరినా వేకువ ఆగునా”? అని ప్రశ్నిస్తుంది.  “కలిమి లోన లేమి లోన పరమాత్ముని తలుచుకో” అని భార్య చెప్పిన మాటలు విని అప్పటి వరకు “చిరాకులు, అసహనాలు“ గా ఉన్న ఆ హీరో అవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతాడు.  ఇంతకంటే వేరే కోన్సేల్లింగ్ సెషన్స్ ఎందుకండి?  మీరే చెప్పండి?  ఏవేవో డిగ్రీలకి, మానసిక రోగ నిపుణులకు కూడా అందని జ్ఞానం ఎంతో ఈ పాటలో ఉంది అంటే కాదంటారా?
జీవన సారం అంతా నింపుకుని ఉన్న ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో!
ఈ మధ్య వచ్చిన “వైశాలి, ఐ అం వెరీ వెరీ సారీ”  పాటలో “సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే సుఖపడే యోగం లేనే లేనట్టే” అని హితవు చెప్తాడు హీరో.   “నలుగిరితో కలవందే బరువేగా బ్రతుకంతా, గిరి గీసి కూర్చుంటే వదిలేయరా జనమంతా” అని హీరోయిన్ కి మంచి చెప్తాడు.  పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు, ఆస్ట్రిచ్ పక్షి భూమిలో తల దాచేసుకుని తనని ఎవరూ చూడట్లేదు అనుకునేటట్టు, “కళ్ళ కేమో గంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లెద్దూ ఒసే మొద్దు” అన్న ఒక వాక్యం ఉంది ఈ పాటలో.  మన ఆటిట్టుడ్, మన దృక్పధం ఎలా ఉందో మనకి లోకం అలా కనపడుతుంది. మనం పాజిటివ్ గా ఉంటే మన చుట్టూ పక్కల కూడా అలాగే ఉంటుంది,  మన దృక్పధమే నెగటివ్ గా ఉంటే అంతా నెగటివ్ గా కనపడుతుంది.  అదే విధంగా “తగువెప్పుడు తెగే దాకా లాగావంటే లాస్ అయిపోతావే” అని హెచ్చరించి, “అపుడపుడు సరేనంటూ సర్దుకుపోతూ ఐస్ అయిపోవాలే” అన్న వాక్యాలు నిజంగా ఆలోచించవలసినవి.  ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి, అంటే – కూర మాడింది అని, చీర కొనలేదని, సినిమాకి తీసుకెళ్ళలేదని, కాఫీ వేడిగా లేదని – విడాకులు వరకు వెళుతున్న యంగ్ కపుల్స్ కి ఇవి కనువిప్పు కలగించక మానవు.   “ఉన్నదోకటే కదా ఎదవ జిందగీ, దాన్ని ఏడిపించకు మాటి మాటికి” అని  చెప్తుంది ఈ పాట.
“సత్తె ఏ గొడవా లేదు, సత్తె ఏ గోలా లేదు పుట్టే పతీవోడూ సత్తాడొయ్” ఇది నేను అంటున్నది కాదు, ఒక పాట పల్లవి.  “కలకాలం కాకులా ఉంటే ఏమొస్తుంది, హంసల్లె దర్జాగుండాలోయ్” అని ప్రభోదించే ఈ పాట,  కష్టాల్, నష్టాల్ వచ్చాయ్ అంటే, రానీ, వాటి గురించి ఆలోచించకు అంటుంది.  “అందమైనది ఈ లోకం, అది చూడకుంటే నీ లోపం, పగలు రేయి లేకుండా రోజే అవదు, ఏ కష్టం నష్టం రాకుండా లైఫే అనరు” అని క్లియర్ గా చెప్తుంది.   అంతే కాదు.  మనం ఏదైనా పని మొదలు పెడతాము అనుకోండి. వెంటనే ఆ పని అవదు.  లేకపోతే ఏదో పొరపాటు అవుతుంది.  అంతే, ఇంక ఆ పని మానేసి కూర్చుంటాము.  అలా కాదు, అలా మానకూడదు, వైఫల్యాలే విజయానికి సోపానాలు అని చెప్పే వాక్యాలు ఈ పాటలో  - “చేయాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు, చేసిన తప్పు మళ్ళీ చేస్తే అది తప్పు, ఏ తప్పు చేయకపోతే ఇంకా తప్పు”.
జీవితం.  ఈ పదం చాలా సామాన్యం గా ఉపయోగించేస్తాం.  అయితే, జీవితం పదంతో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి.   “జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు” అన్న పాట వింటుంటే ఎవరికైనా ఉత్సాహం కలుగక మానదు.  “పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందేట్టు, బండలు రెండుగా పగిలేట్టు తలపడు నరసింహ” అని సాగే ఈ పాటలో ఆశావహ దృక్పధం ప్రతీ పదం లోనూ కనిపిస్తుంది.  ఎంతటి కష్టం అయినా, ఎదిరించి పోరాడితే విజయం నీకు తప్పక దక్కుతుంది అని తెలుపే పాట ఇది.
“జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం సాగని పయనం” ఒక్క వాక్యం లో ఎంతో అర్ధం దాగి ఉంది కదా!
ఆఫీస్ లో అందరూ మీటింగ్ పెట్టుకుని కూర్చుని ఆలోచిస్తున్నారు.  గంటలు గంటలు.  ఇంతలో లంచ్ టైం అయ్యింది.  లంచ్ అయ్యాకా మళ్ళీ సమావేశం అవుదామని అనుకునేంతలో ఒకరు లేచి “ఎవరో ఒకరూ ఎపుడోఅపుడు నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు” అన్న పాట చెప్పి, తను ఇంక మీటింగ్ కి రానని ఆ సమయం లో అయ్యే పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేస్తానని వెళ్ళిపోయాడు.   ఎంత సేపూ తర్జన బర్జనులు అర్జున గర్జనులతో, ఇలా చేస్తే బావుంటుందా, అలా చేస్తే ఏమవుతుంది అనుకునే బదులు కొంచెం పని కూడా చేస్తే బాగుంటుంది, ఒక నాంది ఇంకా ఎంతో పురోగతికి హేతువు అవుతుంది  అని చెప్పే పాట ఇది.  “మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ”, “కదలరు ఎవ్వరూ వేకువ వొచ్చినా అనుకోని కోడి కూత నిదరపోదుగా,  జగతికి మేలుకొల్పు మానుకోదుగా,  మొదటి చినుకు సూటిగా దూకిరానిదే, మబ్బు పొంగు చాటుగా వొదిగి దాగితే వాన ధార రాదుగా నేల దారికీ, ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ”  లాంటి వాక్యాలు నిండి ఉన్న పాట ఇది.  ప్రతీ ఒక్కరు ఆద్యంతం చదవాల్సిన పాట ఇది.
“ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేలా ఆఆ” – నాకు ఎంతో ఇష్టమైన ఇంకొక పాట..  అనుకోని సంఘటనలో కాలు పోగొట్టుకుని నడవడమే కష్టమైన ఒక నర్తకి యదార్ధ గాధ ఇది.  చివరికి ఎలాగో కృత్రిమ కాలు అమర్చి నడవడం వరకు చేయగలిగిన వైద్యులతో ఆమె అన్న మాటలు – “నేను తిరిగి నృత్యం చేయాలి”, అని.  దానిని ఆ వైద్యులు కూడా సవాలు గా తీసుకుని అటువంటి కాలు అమర్చడం, ఆ నర్తకి అకుంఠిత దీక్ష తో సాధన చేసి తిరిగి నృత్య ప్రదర్సన ఇవ్వడం నిజంగా అందరికీ స్పూర్తిదాయకం.  తానూ కష్టాల్లో ఉన్నప్పుడ్డు వదిలి వెళ్ళిపోయిన మనిషి ఇదంతా చూసి స్వార్ధం తో తిరిగి వచ్చినప్పుడు వచ్చే పాట ఇది.  ఇక తనకి ఎవ్వరి ఆసరా, సానుభూతి అవసరం లేదని,  నృత్య సాధన చేస్తూ సాగే పాటలో ఈ వాక్యాలు చూడండి – “నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదిక గా నటన మాడనా, అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా” – ఈ అనంత ప్రపంచం జయించినంత ఉత్సాహం అంతా ఆ వాక్యాల్లో ప్రతిబంబిస్తుంది.
ఒక పని చేయాలి అని నిశ్చయించుకున్న తరువాత, అదే అయిపోతుందిలే అని కూర్చుంటే ఆ పని అవుతుందా?  ముమ్మాటికి కాదు.  నిరంతర శ్రమ, సాధనతో మాత్రమే అది సాధ్యమవుతుంది.  అది ఎలా ఉండాలి అంటే “చెయ్ జగము మరిచి జీవితమే సాధన, నీ మదిని తెరిచి చూడటమే శోధన” అన్న పాట మనకి దారి చూపుతుంది. “ఆశయమన్నది నీ వరమైతే, ఆ అంబరమే తలవంచుతుంది, నీ కృషి నీకు ఇంధనం లా పని చేస్తుంది, అది కావాలి సాగర బంధనం” అని చెప్పే ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకం.
మంచి పాటకి భాష తో సంబంధం లేదని మన అందరికీ తెలుసు కదా.  కొన్ని హిందీ పాటలు కూడా చూద్దాం.  “జిందగీ తో బేవఫా హైన్ ఎక్ దిన్ టుక్రాయేగి, మవుత్ మెహబూబా హై అప్ని సాత్ లేకర్ జాయేగీ” – జీవితం మోసగత్తె ఒక రోజు నిన్ను వదిలేస్తుంది, చావు నీ ప్రియురాలు లాంటిది తనతో పాటు నిన్ను తీసుకెళ్తుంది.  “రోతే హుయే ఆతే హాయ్ సబ్ హస్తా హు జో జాయేగా వొహ్ ముకద్దర్ కా సికందర్ జానేమన్ కేహ్లాయేగా” – అందరూ ఏడుస్తూ ఈ ప్రపంచం లోకి వస్తారు, నవ్వుతు వెళ్ళేవాడే అసలైన హీరో.    ఏవంటారు, కాదంటారా?
“జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్నే జానా”  – జీవితం ఒక అందమైన ప్రయాణం లాంటిది, ఈ ప్రయాణం లో రేపు ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోగలిగారు చెప్పండి? అన్న పాట ఇది.  సరే, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియక పోయి ఉండొచ్చు, కానీ ఇవాల్టి సంగతి ఏంటి?  ఎప్పుడో సంగతి ఎందుకు?  ఈ రోజు ఏం చేయాలో ఆ సంగతి ఆలోచించచ్చు కదా!  అలాగే, ఈ పాటలో “సఫర్” అనే పదాన్ని హిందీ లో కాక ఆంగ్లం లో అర్ధం చేసుకుని, సఫర్ అని ఓ బాధ పడిపోయి, ఇతరులను బాధపెట్టి   మధన పడిపొయే వారి గురించి ఏం చేస్తాం చెప్పండి.  బాబు, భాషని, అందులోని భావాన్నీ సరిగ్గా అర్ధం చేసుకోండి అని చెప్పగలం అంతే.
“జిందగీ కైసి హైన్ పహేలీ హాయ్, కభి ఏ హసాయే కభి ఏ రులాయే” – జీవితం అనేది ఒక చిక్కుముడి, అంతుపట్టని ప్రహేళిక, ఒక సారి నవ్విస్తుంది, ఇంకోసారి ఏడిపిస్తుంది.  “సుఖ్ కే సబ్ సాతి, దుఃఖ మే నా కోయి” – నువ్వు బావున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, నీతో మాట్టాడుతారు.  అదే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడ్డు ఒక్కరూ నీ మొఖం చూడరు.  “మేరే రాం, మేరే రాం, తేరా నామ్  ఏక్ సాచ దూజ న కోయి” – రామా – నీ నామమోకటే సత్యం, నీ కన్నా నాకెవ్వరు దిక్కు, నిన్ను తలుచుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి.  అవును, నిజం.
“చాహత్ కే ధో పల్ భి మిల్ పాయె దునియా మే ఏ భి కం హై క్యా?” – ఇటీవలి “సేనోరిటా”  పాట ఇది.   సంతోషం  ఏదో ఎక్కడో ఉంది, దాన్ని వెదకాలి, అలా వెదకడం అనే ఎండమావి వెనక పరుగెత్తాలి అని కాకుండా, నువ్వున్న చోటులోనే ఒక క్షణం హాయిగా ఉంటే చాలదా అని అడుగుతోంది ఈ పాట.
ఇక మళ్ళీ మన తెలుగు పాటల్లోకి వస్తే -
“ఏరువాక సాగారో” పాట.  ఆనాటికి, ఈనాటికి “కల్లా కపటం ఎరుగని వాడు, లోకం పోకడ తెలియని వాడు” ఎవరంటే రైతన్న.  ఎన్నో దశాబ్దాల నాటి పాట ఈ రోజుకీ అప్లై అవుతుంది.  “పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు”, అలాగే “పల్లెటూళ్లలో చెల్లనివాళ్లు, ఎందుకు కొరగాని వారు ఏంచేస్తారు అంటే పాలి“ట్రిక్స్” తో బ్రతుకుతారు.  “పెజా సేవ, పెజా సేవా” అని పగలు లేచినప్పటి నుంచి అరిచే వీరు, మరి పని చేయండి అంటే మాత్రం “వొళ్లు వంచి చాకిరికి మళ్లరు” అని చెళ్ళున కొట్టే పాట ఇది.  ఇది అప్పటి ఎప్పుడో సంగతి కాదు.  ఈ రోజు జరుగుతున్న దానికి నిలువెత్తు నిదర్శనం.  ఇంకేంటి, నేను పదవి లోకి వచ్చేసాను, నాకింక ఎదురు లేదు అని కొందరు  అనుకున్నారు. కోట్లు సంపాదించారు. ఆ క్రమం లో రైతన్నని మరిచారు.  ఆ తరువాత ఏమైందో అప్పటి పాటలో ఈ వాక్యాలు, ప్రతీ పదము నిజమయ్యింది చదవండి:  “పదవులు తిరమని బ్రమిసే వాళ్లే, కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే, నీవే దిక్కని వత్తురు పదవోయ్”.  అవును, అన్ని రోజులు ఒకలా ఉండవు.  మారుతాయి.  మారాయ్.  అయితే, కొద్దిమందికి ఇది తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయిందేమో?  అందుకే, ఎప్పుడూ దేశానికి వెన్నుముక అయిన రైతన్నని మరవకూడదు.
గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం దానితో పాటు మనుషులు అందులోని మనసుల కాలుష్యం – ఎక్కడ చూసినా ఇదే పరీస్తితి.  మరి ఎం చేయాలి?  చాలా సింపుల్.  అందుకు సమాధానమే ఈ పాట – “పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకం లో కన్నీరింక చెల్లు, చిన్ని చిన్ని గూటిలోనే స్వర్గముందిలే, చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకా చిలుకకు చీరలెందుకు … అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట”.  ఏదో చేయాలన్న తాపత్రయం లో మనిషి విచక్షణా రహితంగా చెట్లు నరికేస్తున్నాడు, అడవులు అంతరించి పోతున్నా పట్టించుకోవట్లేదు, ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి అన్న ధ్యాసే తప్ప ఇంకేమి కనపడని, వినపడని స్టేజి లోకి వెళ్ళిపోయాడు.  అసలు ఇవి ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అన్న సత్యం గుర్తించ లేక పోతున్నాడు. “అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం, మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం”.   ఇలా ఒక దానితో ఇంకొకటి, వాటికి ఉన్న అనుబంధం, వాటన్నిటితో పాటు తనకు ఉన్న అనుబంధం తెలుసుకున్న నాడు “బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం”.
“యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే,  యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే” – జోరుగా సాగే పాట.  “కళ్ళల్లో కలలుంటే, గుండెల్లో దమ్ముంటే రోజూ రంగేళి లే” అని చెప్పే పాట.  “జనమందరిలో మనమేవ్వరంటే” వాటోమాటిక్ గా తెలియాలి, ఒక విలువుండాలి, ఘన చరితలు గల ఆ కొందరి లిస్టు లో మన పేరు కూడా ఉండాలి, అనుదినం కొత్తగా, ఒక ఫ్రెష్ రోజులా ఉన్నప్పుడు, బ్రతకడం అప్పుడే పండుగ అంటుంది ఈ పాట.  ఈ లోకం లో ఉంటూ, యాంత్రికంగా చుట్టూ ప్రపంచాన్నీ చూస్తూ, “జీవించడమే” అంటే తెలియని వాళ్ళని చూస్తె జాలి పడుతుంది.  కనిపించని తల రాతని, అర చేతులలో గీతని పట్టుకు వెళ్ళాడి, అవే బ్రతుకును నడిపిస్తాయని నమ్మే వాళ్ళని ఏం చేయాలి?, అహ, అసలు ఎం చేయాలి? అని అడుగుతుంది ఈ పాట.  ఏం చేసినా తప్పు లేదంటారా?  ఊరికే ఊహల్లో తేలుతూ ఉండడం కాకుండా,   నువ్వు అనుకున్నది నిజం చేసుకో, నింగి లో నిలిచిపో తారలా అని క్లియర్ కట్ గా చెప్తుంది చివరలో.
నలుగురిలో మనకి ఒక స్పెషల్ ఆధార్ కార్డ్ ఉండాలి అనే విషయం పూలరంగడు కూడా చెప్తాడు “ఏక్ దో  తీన్ చార్ చార్” పాటలో.  “బ్రతుకంటే వార్ వార్ పోరాడారా” బ్రదర్ అంటూ “కృషి ఉంటె యార్ యార్ ఋషులయ్యి పోతార్” అన్న అన్నగారి మాటని నమ్ముకుని ముందుకెళ్ళే ఈ హీరో,  “నీ లైఫ్ కి నువ్వే బిగ్ బాస్” అని చెప్తాడు.  నమ్మినట్టు ముందుకు వెళ్ళు, నచ్చినట్టు దూసుకువెళ్ళు “కండలు, గుండెలు ఉంటె కొండలైనా అడ్డుకోవురో” అని అంటాడు.  లైఫ్ అన్నది నీడ లాంటిది లైట్ లేకపోతే అది రాదు – ఆ వెలుగు నువ్వు కావాలి – ఎంత మంచి అర్ధం ఉంది ఈ వాక్యంలో.  అలాగే కష్టమన్నది నీకు ఒక తోడు లాంటిది అది నిన్నెప్పుడు వీడిపోదు అని చెప్తాడు.  ఇక్కడ మళ్ళీ లిస్టు గురించి వస్తుంది.  “కష్ట పడ్డ వాళ్ళ లిస్టు లో చేరాలి ఆ లిస్టు లో ఫస్ట్ రాంక్ కొట్టాలి” అంటాడు.  ఈ పాటలో ఇంకొక ముఖ్యమైన కొన్సుప్ట్ ఉంది.  అప్పు చేయడం మంచిది కాదు, నాకు అప్పు చేయడం అంటే ఇష్టం ఉండదు అంటూ ఉంటారు కొంత మంది.  ఇప్పుడు, దేశాలే అప్పు తీసుకుంటున్నాయి.  కేవలం నీ దగ్గర ఉన్న ఎమౌంట్ తో అన్నీ చేయాలి అంటే అవ్వని పని.  అందుకని అప్పు చేసే అవసరం రావొచ్చు.  అయితే, చేసిన ఆ అప్పుని సద్వినియోగ పరుచుకుని, దానితో ఏదైనా పనికొచ్చే పని చేసినప్పుడు, అది ఆ రూపాయి తో పాటు ఇంకొక రూపాయి సంపాదించినప్పుడు, అటువంటి అప్పు చేయడం లో తప్పు లేదు అంటాడు.  “రస్క్ లేనిదే చాయి లో రిస్క్ లేనిదే లైఫ్ కిక్ లేదురో”, అయితే ఆ రిస్క్ తీసుకునే వాళ్ళ లిస్టు లోకి ఎక్కినా, వాళ్ళు నీకు సలాం కొట్టేలా ఎదగాలి అంటూ పాజిటివ్ ఆలోచనలు నింపే పాట ఇది.  “ఆకాశం నీ హద్దురా” అన్న పాటలో “నిలబడి తాగే నీళ్ళు చేదురా, పరుగెతైనా పాలే తాగరా” అని ఎప్పుడో చెప్పారు కదా.
ఇందాక ఒక సందర్భం లో చెప్పాను   – “పేషన్సు లేకపోతే పేషెంటే” అని.  అయితే, ఇది యూత్ కి వర్తించదు.  ఒక మంచి పని చేయాలి అనుకున్న వారు – అది ఎంత తొందరగా పూర్తి అవుతుంది అన్నట్టు ఉండాలి.  చదువుతున్నారు అనుకోండి, అది ఏంత త్వరగా పూర్తి  చేయాలి అన్నట్టు ఉండాలి, రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఎంత త్వరగా పూర్తి  చేయాలి అని ఉండాలి కానీ, హాస్టల్ వసతి మెస్సు ఫుడ్డు – ఇదే బావుంది, మెల్లిగా ఎలాగోలా ఒక అయిదు పదేళ్ళు లాగించేద్దాం అని ఉండకూడదు కదా.    ఇలాంటి తొందర ఉండడం “ఆశావహ అసహనం” అంటాను నేను.   పలికే గోరింకకి అదే చెప్తుంది ఒక పాటలో ఒక అమ్మాయి.  తను “ఎదురు చూసే దీపావళి పండుగ ఎప్పుడో కాదు నేడే రావాలి” అంటుంది.  పైగా, రేపటి సత్యాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయునే అంటుంది.  పగలే వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లె వస్తే నేరమా – ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళని చూస్తె ముచ్చట వేస్తుంది.  కొంచెం ఆశ, కొన్ని కలలు కలియకే జీవితమంటే – నువ్వు అట్లీస్ట్, కనీసం ఓ వంద కలలను కంటే, వాటిలో ఆరు అయినా నిజం అవుతాయి – అంతే కానీ కళ్ళు మూసుకు పడుకుంటే ఒరిగేదేమిటి అని అడుగుతుంది.  రేపు అన్నది దేవునికి, నేడు అన్నది మనషులకు అంటూ “బ్రతుకే బ్రతికేందుకు” అంటుంది.  మనిషి గా పుట్టడం వీజీ కానీ, మనిషి గా బ్రతకడం చాలా కష్టం అని “ఒక అద్భుతః సినిమా” లో డైలాగ్.  అలాగే, “బ్రతుకే బ్రతికేందుకు” – ఇదేమిటి, వేరే చెప్పాలా అంటే, అవును ఈ రోజుల్లో చెప్పాల్సి వస్తోంది.  ఎందుకంటే, ఆ బ్రతకడం మానేసి, ఎంతసేపు తెగ ఆలో”చించేస్తూ” ఉంటాం కదా?   అందుకే అన్నారు – “ఎస్టర్డే ఇస్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ఏ గిఫ్ట్ డట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ప్రెసెంట్ – నిన్న అన్నది చరిత్ర, రేపు అన్నది మనకి తెలీనిది, ఇవాళ అనేది మాత్రమె నీకు తెలిసినది, నీ చేతులలో ఉన్నది, అందుకే దాన్ని ఒక బహుమానం అన్నారు.
ఒక బంగారం లాంటి పాటతో ముగిద్దాం.  “ఎవరు ఆహా అన్నా, ఎవరో ఓహో అన్నా, నీవు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకం లోనా నువ్వే అసలు బంగారం” అన్న పాట.  ఒక్క సారి మాట ఇస్తే ఆ మాట తప్పకు అని, ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పే పాట.  ఎవ్వరి జోలికీ పోకుండా నీ పని నువ్వు చేసుకో.  కానీ, అలా చేసుకుంటున్న నీ పనికి ఎవరైనా అడ్డువస్తే మాత్రం, వచ్చిన వాడి “టాపు లేపి మరి చూపారా” అని కూడా చెపుతుంది.  మనం “మంచి మంచి” అని ఉంటాం.  కానీ ఆ మంచిని చేతకానితనంగా కానీ, లేక ఆ మంచిని వారి స్వార్ధం కోసం ఉపయోగించుకుందాం అనుకునే వారిని  కానీ ఉపేక్షించ వద్దు అని చెప్పే సాంగ్ ఇది.  ఇది ఈ రోజుల్లో చాలా అవసరం.
ఇలా, ఎన్నెన్నో పాటలు, అక్షర లక్షలు చేసేవి, జీవిత సత్యాలు తెలిపేవి.  అందులో కొన్ని మనం చూసాం.  వీటి నుంచి స్ఫూర్తిని పొందిన నాడు, అవి మనలో మార్పు కలిగించి, మన మన  లక్ష్యాలను చేరుకునేనుందుకు తప్పక దోహదపడుతాయి అనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు.

గృహహింస నిరోధక చట్టం తెచ్చిన చేటు

http://www.youtube.com/watch?v=aCkFH29xCOw&feature=player_embedded





ఈ మధ్యకాలంలో భారతీయ గృహహింస నిరోధక చట్టం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఆ చట్టం బాధిత స్త్రీలకు ఉపశమనం కలిగిస్తుందని సాధారణ ప్రజల అభిప్రాయం. అయితే దాని దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆకాశరామన్న గారు తన దృక్కోణాన్ని ఈ వ్యాసం ద్వారా మనతో పంచుకుంటున్నారు.
A,B అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక తగాదా వచ్చి పడింది. దాన్ని పరిష్కరించమని మరో వ్యక్తి దగ్గరకి వెళ్ళారు. ఆ వ్యక్తి ఒక నిబంధన ప్రకారమే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధన ఏమిటంటే, తన వద్ద ఉన్న నాణేన్ని ఎగరేసి… వచ్చిన ఫలితం “బొమ్మ” అయితే — తీర్పు Bకి “వ్యతిరేకంగా” ఇవ్వాలి, అతీర్పు Bకి విపరీతమైన నష్టాన్ని, కష్టాన్ని కలిగించేదైనా పట్టించుకోనక్కర్లేదు. ఫలితం “బొరుసు” అయితే — తీర్పు A కి “ఎలాంటి నష్టం కానీ, కష్టం కానీ కలగకుండా” ఇవ్వాలి, వీలైతే అనుకూలంగా కూడా ఇవ్వచ్చు.
ఇదేం నిబంధనా? వచ్చిన ఫలితంతోగానీ, తప్పెవరిది అన్న నిజంతోగానీ సంబంధం లేకుండా Bకి వ్యతిరేకంగానే తీర్పువస్తుంది కాబట్టి దీనంతటి వివక్షాపూరితమైన నిబంధన ఇంకొకటి ఉండదు అని అంటారా..? సరే ఈ విషయాన్ని కాస్త పక్కనబెట్టి, స్త్రీల రక్షణకోసం చేయబడిన ఓచట్టాన్ని కాస్త పరిశీలిద్దాం.
గృహహింస నిరోధక చట్టం 2005 గృహహింస నిరోధక చట్టం ఒకసారి చదినవారు ఎవ్వరైనా, అసలు ఇలాంటి చట్టం ఒకటి రూపకల్పన చేయొచ్చా? చేసినా ఆమోదాన్ని పొందగలుగుతుందా అన్న సందేహాలు పొందకుండా ఉండడం అసంభవం. కానీ, ప్రస్తుత స్త్రీవాద ప్రపంచములో అది సాధ్యమేనన్న విషయం 2006 అక్టొబరులోనే అందరికీ అవగతమయింది.
అసలు గృహహింస అంటే ఏమిటి? ఈ చట్టం, స్త్రీలపై జరిగే శారీరక హింస, మానసిక హింస, లైంగిక హింస, ఆర్థికంగా జరిపే హింస, స్త్రీ ఆరోగ్యం, భధ్రతలకు విఘాతం కలిగించడం, కట్నము తెమ్మని వేధించడంలాంటివే కాకుండా, మాటలద్వారా కలిగే హింసను కూడా చేర్చి గృహహింస అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని కల్పించింది. ఇందులో బాదితురాలు కేవలం స్త్రీ మాత్రమే, ఆమె కుటుంబములోని ఏస్త్రీయైనా కావచ్చు. వారందరికీ ఈ చట్టం గృహహింసనుండి రక్షణ కల్పిస్తుంది. ఇవే కాకుండా ఇందులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఆంశము ఏమిటంటే స్త్రీకి నివాసపు హక్కును కల్పించడం. అంటే, ఆమె ఉంటున్న ఇల్లు ఆమెది కానప్పటికీ అందులోనుండి ఆమెను పంపించే వీలు లేదు. ఈ చట్టం, ఇది వరకు జరిగిన హింసే కాదు, భవిష్యత్తులో హింస జరిగే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. (Not only the actual abuse but also the threat of abuse too considered)
ఈ చట్టంపైనున్న అభ్యంతరాలేమిటి:
ఈ చట్టం అమలులోనికి వచ్చిన దగ్గరనుండి మొదలుకొని ఇప్పటి వరకూ దీనిమీద వెల్లువెత్తిన విమర్శలు బహుశా మరే చట్టం మీద వచ్చివుండవు. సామాన్యుడి దగ్గరనుండి అటార్నీ జనరల్ వరకూ ఈ చట్టాన్ని అందులోని కొన్ని ఆంశాలను తీవ్రంగా విమర్శించడం జరిగింది. అంతగా విమర్శలను ఎదుర్కొన్న ఈ చట్టంలో ఉన్న కొన్ని అంశాలు..
1. ఈ గృహహింస చట్టం ప్రకారం, స్త్రీ తాను చేసే ఆరోపణలకు ఎటువంటి సాక్షాధారం చూపించనవసరం లేదు. కేవలం ఆమె నోటిమాటనే సాక్షంగా స్వీకరించి, ప్రతివాదిని దోషిగా పరిగణిస్తుంది. ఆవిడ ఏమి చెప్పినా, అది నిజం కాదని ప్రతివాది నిరూపించేంత వరకూ, అది నిజంగానే చెలామని అవుతుంది. అంటే స్త్రీలందరూ సత్యం మాత్రమే పలికే సత్య హరిశ్చంద్రుని ఆంశ అని, దానికి వ్యతిరేకంగా నిరూపించబడే వరకూ భావించాలన్నమాట. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మగవాడిని స్త్రీ దయాదాక్షిణ్యాల మీద బతుకమని చెప్పడంలాంటిది.
2. ఇందులో గృహహింసకు ఇచ్చిన నిర్వచనాన్ని పరిశిలిస్తే, శారీరక హింస, ఆర్థికంగా జరిగే హింసల్లాంటివి జరిగాయనో/జరగలేదనో నిరూపించ వచ్చు. కానీ మానసిక హింసను, మాటలద్వారా కలిగే హింసను నిరూపించడం దాదాపుగా కుదరక పోవచ్చు. ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, ఇటువంటి హింసలు స్త్రీలు నిరూపించలేకపోవడానికి కారణం వాటికి సరైన సాక్షాధారాలు చూపించడం కుదరకపోవడమే అని వాదించిన స్త్రీవాదులే, ఇప్పుడు అదే హింస జరగలేదని నిరూపించుకునే భాధ్యత పురుషుడిదే అని సెలవివ్వడం. కష్టం ఎవరికైనా కష్టమే కదా? మరి మగవారిపై ఎందుకంత వివక్ష?
3. ఈ చట్టం ప్రకారం, ప్రతివాది మీద కేసును భాదిత స్త్రీయే పెట్టనవసరంలేదు. ఎవ్వరైనా పెట్టవచ్చు. కావలసిందల్లా ఆ స్త్రీకి అది అవసరమని అవ్యక్తి భావిస్తేచాలు. అంటే, ఆమె బందువులు, స్నేహితులు, పక్కింటోల్లు, చివరకు ఆమె ప్రియుడు కూడా భర్త మీద గానీ, ఆ గృహంలోని మరోపురుషుడి మీద గానీ కేసును పెట్టొచ్చు. ఇంకోవిషయమేమిటంటే, ప్రస్తుతం వివాహబంధములో ఉన్న స్త్రీలే కాదు, విడాకులు పొందిన స్త్రీలు, సహజీవనం చేసే స్త్రీలు (Live – in relationships) కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకసారి, ఈరెండింటినీ కలిపి ఆలోచించండి, ఇవి పురుషుడి జీవితాన్ని ఎలాప్రభావితం చేస్తాయో? అసలు ఈ చట్టము దుర్వినియోగం జరుగుతుంది అంటే ఆశ్చర్య పోయే వారు బహుశా వీటిని చాలా కన్వీనియంట్‌గా విస్మరించడం జరుగుతోందని చెప్పొచ్చు.
4. ఈ చట్టములో ఉన్న ముఖ్య అంశాలలో ఒకటి స్త్రీకి నివాసపు హక్కును కల్పించడం. అంటే తాను నివసిస్తున్న ఇంటినుండి ఆమెను బయటకు పంపించే అధికారం ఎవ్వరికీ ఉండదు. అది అద్దె ఇల్లు అయినా సరే. ఒకానొక కేసులో సుప్రీం కోర్టు ఈ నివాసపు హక్కుపై స్పందిస్తూ, వివాహిత మహిళకు తన భర్త ఇంటిలోమాత్రమే అధికారం ఉంటుందని తేల్చిచెప్పి కొంత ఉపశమనాన్ని కలిగించడమే కాదు, ఈ చట్టం అత్యంత లోపభూయిష్టంగా కూర్చిన చట్టంగా (Losely drafted law) అభివర్ణించింది. దీన్ని స్త్రీవాదులు వ్యతిరేకించినా, సుప్రీం కోర్టు ముందు వారి ఆటలు సాగలేదు. మరో విషయం ఏమిటంటే, ఈ చట్టాన్ని ఉపయోగించి, ప్రస్తుతం జరుగున్న హింసనే కాదు, భవిష్యత్తులో జరిగే అవకాశమున్న హింసమీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపితే మగవారి హక్కులకు తీవ్రవిఘాతమేర్పడుతోంది. ప్రతివాది కారణంగా తనకు ముప్పు పొంచి ఉంది అని వాదించి, అతని సొంత ఇంటినుండి అతన్ని వెల్లగొట్టవచ్చు. అంతే కాదు, అతను ఆమె నివసించే పరిసరప్రాంతాలకు రాకుండా నిరోదించ వచ్చు. ఒకవేల అతను దీన్ని అతిక్రమించినట్లు రుజువైతే అది క్రిమినల్ కేసూవుతుంది. దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.
5. అసలు వీటన్నింటికన్నా అతిపెద్ద దారుణమేమిటంటే, గృహహింస అంగానే భాదితులు కేవలం స్తీలు మాత్రమేనని, మగవారు ప్రతివాదులు మాత్రమే అనే అభిప్రాన్ని బలపరిచేలా ఒక చట్టం చేయడం. అసలు సిసలైన వివక్షకు నిదర్శనం. స్త్రీల హక్కులన్నీ మానవహక్కులే అనేవాళ్లు, పురుషుల హక్కుల విషయములో చూపించిన హ్రస్వదృష్టికి నిదర్శనం. ఇది అంతర్జాతీయ మనవహక్కుల నిభందనలకేకాదు, మన రాజ్యాంగములోని సమానత్వ సిద్దాంతాలను కూడా తుంగలో తొక్కుతోంది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా జరిగిన అనేక పరిశోధనలలొనూ, అధ్యయణాలలోను తేలిన విషయమేమిటంటే, గృహహింస అనేది ఏఒక్కరికో సంభందించినది కాదు. స్త్రీలు, పురుషులు ఇద్దరూ గృహహింసకు లోనవుతున్నారన్నరని, స్త్రీలు మగవారితో సమానంగా, కొన్నిసార్లు మగవారికన్నా ఎక్కువ అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తారని నిరూపించబడింది. శారీరకంగా స్త్రీ బలహీనురాలైనప్పటికి దాన్ని ఏదైన ఒక వస్తువుని విసరడము ద్వారా కానీ, మరేదైనా ఆయుధాన్ని ఉపయోగించడం ద్వారాకానీ స్త్రీలు అధిగమిస్తున్నారని తేల్చింది. మరి స్త్రీలనగానే బాధితురాలు, పురుషులు అనగానే హింసించే వారు అనడం వివక్ష కాక మరేమిటి? గృహహింస పట్ల, మగవారి పట్ల సమాజములో ఉన్న దృక్పథాన్ని (అపోహలను) అద్బుతంగా చిత్రీకరించిన ఈ విడియోని ఒక సారి చూడండి.
6. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన స్త్రీలకు ఎటువంటి శిక్షా ఉండదు. అంటే ఇది దుర్వినియోగం చెయ్యండని వారిని ప్రోత్సహించడమే. ఇవే కాదు, గృహహింస నిరోధక చట్టం గురించి ఇంకా చాలా రాయొచ్చు. విశేషమేమిటంటే చట్టం దుర్వినియోగమె కాదు, సద్వినియోగమే జరిగినా అది కొన్నిసార్లు మగవారి హక్కులకు తీవ్రవిఘాతం కలిగించడం అత్యంత శోచనీయం.
ఇప్పుడు మనం వ్యాసం మొదట్లో చెప్పుకున్న, నాణేన్ని ఎగరేసి తీర్పు ఇచ్చే నిభందనను ఒక సారి పరిశిలిద్దాం. ఇక్కడ ఉన్న గొప్పవిషయమేమిటంటే, A,B ఇరువురికీ తమకు న్యాయం చేయమని కోరే హక్కువుంది. కానీ మన చట్టములో ఆ అవకాశం ఉండదు. A,Bలిద్దరిలో ఎవ్వరైనా తమ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకూ నిర్దోషిగానే ఉంటారు. కానీ ఘణత వహించిన ఈ స్త్రీ సంరక్షణ చట్టాలలో, కాదని నిరూపిన అయ్యే వరకూ మగాడు దోషే. నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాధ్యత అతనిదే. అంతే కాదు, దుర్వినియోగం చేసిన స్త్రీకి ఎలాంటి శిక్షా ఉండదు.
కాకపోతే, ఈ చట్టాలు మరీ బొమ్మ, బొరుసు వేసినట్టుగా కాకుండా ఒక పద్దతి ప్రకారం విచారణ జరిపేలా చేస్తాయి. కానీ, జెండర్ సెన్సిటివిటీ, స్త్రీల సమస్యల పట్ల అవగాహన అన్న పేరుతో మీడియాని, పోలీసులనూ స్త్రీవాదులు ఎప్పటికప్పుడు బ్రయిన్-వాష్ చేస్తూ ఉంటారు. వీరికి జెండర్ సెన్సిటివిటీ ప్రోగ్రాములు ఇస్తుంటారు. వారు కానీ పొరపాటున స్త్రీలు దీన్ని దుర్వినియోగ పరిచే అవకాశముంది అనో, లేదా మగవారిపై కుడా గృహహింస జరిగే అవకాశముంది కదా అనో అభిప్రాయాన్ని వ్యక్తపరిచితే, వారికి Gender Sensitivity లేదనితేల్చి పారేస్తారు. Gender Sensitivity మీద వారందరికీ అవగాహన ఉండాలని డిమాండు చేస్తారు. ఈ తరహా Gender Sensitivity లేదని వాపోయే స్త్రీవాదులను మనం తరచూ చుస్తూనే ఉంటం. అంటే వీరు వివక్షాపూరిత చట్టాలు రూపొందించడముతో ఆగడం లేదు, వివక్షాపూరిత వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఇక మగాడికి న్యాయం ఎలా జరుగుతుంది (హీన పక్షం కనీసం అన్యాయం జరగకుండా ఎలా ఉంటుంది).
అందుకేనేమో రేణుకా చౌదరి ఒకానొక సందర్భంలో “It’s time for men to suffer” అంటూ జాతీయ ఛానెలులోనె చెప్పారు.
P.S: భారతదేశములో ఉండే మగాళ్ళందరికీ, ఆమాటకొస్తే గృహహింస నిరోధక చట్టంలాంటీ చట్టాలు అమలవుతున్న దేశాలన్నింటిలోని మగాళ్ళందరూ తప్పకుండా పాటించాల్సిందేమిటంటే, ” ఎట్టి పరిస్థితులలోనైనా సరే ఇల్లు కొనడం అనే పనిని మానుకోవాలి”. ఇల్లు అనేది మగాడి ఆస్తికాదు. అదెప్పుడో స్త్రీల ఆస్తిగా మారిపోయింది. నీది కాని దానికోసం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును EMIలు కట్టడానికో, ఇల్లు కట్టడానికో వెచ్చించడం ఏమాత్రం వివేకవంతమైన పనికాదు.
So Never Buy A Home.